ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి
ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : దేశాన్ని పోలియో రహితంగా కొనసాగించాలంటే ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమం చిన్నారులను పోలియో వ్యాధి నుంచి రక్షించే కీలక కార్యక్రమమని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలకు తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించాలని కోరారు.
అనంతరం ఎమ్మెల్యే చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం విజయవంతానికి కృషి చేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బందిని అభినందించారు.
కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
