ప్రజా గాయకుడు గిద్దె రాంనర్సయ్యకు దళిత రత్న అవార్డు

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: ప్రముఖ ప్రజా గాయకుడు గిద్దె రాంనర్సయ్యకు దళిత రత్న అవార్డు లభించింది. ఈ సందర్భంగా శనివారం పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని గిద్దె రాంనర్సయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆయనకు దళిత రత్నం అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రజా గాయకుడిగా గిద్దె రాంనర్సయ్య ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడంలో చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

ఆయనకు దళిత రత్న అవార్డు రావడం సంతోషకరమని తెలిపారు. కళారంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ప్రజా ఉద్యమ జానపద గాయకుడు గిద్దె రాంనర్సయ్య మాట్లాడుతూ తన సేవలను గుర్తించి దళిత రత్న అవార్డుతో సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

ఈ గౌరవం తనపై మరింత బాధ్యతను పెంచిందని, ప్రజా సమస్యలు, సామాజిక చైతన్యంపై తన గళాన్ని మరింత బలంగా వినిపిస్తానని తెలిపారు. తనను ప్రోత్సహించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దళిత నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కళాకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దళిత రత్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గుండాల నరసయ్య తదితరులు పాల్గొని గిద్దె రాంనర్సయ్యకు అభినందనలు తెలిపారు.