కామారెడ్డిలో భారీగా నాటుసారా ముడిసరుకుల రవాణా భగ్నం..
- 220 కిలోల నల్లబెల్లం, పటిక స్వాధీనం, ఇద్దరి అరెస్ట్
కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లాలో నాటుసారా ముడిసరుకుల అక్రమ రవాణాపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ప్రోహిబిషన్ ఎక్సైజ్ అధికారి బి.ముకుంద రెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది నిర్వహించిన విస్తృత తనిఖీలలో భారీగా నాటుసారా ముడిసరుకు పట్టుబడింది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు ఒక కారును, పెద్ద ఎత్తున బెల్లం, పటికను స్వాధీనం చేసుకున్నారు. ఘటన వివరాలు అందిన నమ్మదగిన సమాచారం మేరకు ఎక్సైజ్ సిబ్బంది సిరిసిల్ల రోడ్డులో వాహన తనిఖీలు చేపట్టారు.
ఆ సమయంలో అనుమానాస్పదంగా వస్తున్న ఒక ఇండికా కారును: ఎపీ 28 సీడీ 3397 తనిఖీ చేయగా, అందులో 60 కిలోల నల్ల బెల్లం, 10 కిలోల పటిక లభించాయి. దీంతో వాహనంలో ఉన్న వీర్నపల్లి గ్రామానికి చెందిన భూక్య గంగను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కామారెడ్డి గంజ్ మార్కెట్‌లోని కృష్ణ కుమార్ మార్పెంటిపై దాడులు నిర్వహించారు. అక్కడ అదనంగా 160 కిలోల నల్ల బెల్లం, 54 కిలోల పటికను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో రెండో నిందితుడైన కృష్ణ కుమార్‌ను కూడా అరెస్ట్ చేశారు.
నల్ల బెల్లం మొత్తం 220 కిలోలు, పటిక మొత్తం 64 కిలోలు, ఇండికా కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నాటుసారా తయారీకి పాల్పడినా, వాటి ముడి సరుకులను అక్రమంగా రవాణా చేసినా ఎంతటివారైనా సరే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారి బి.ముకుంద రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. జిల్లాలో ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను అణచివేయడానికి దాడులు ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. పాల్గొన్న సిబ్బంది ఈ దాడుల నిర్వహణలో ఎక్సైజ్ సిఐ సంపత్ కృష్ణ, ఎస్సై విక్రమ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ జాన్ కానిస్టేబుల్స్ గోరి, పవన్ కుమార్, రాజు, బాబు, శరత్ చంద్ర తదితరులు క్రియాశీలకంగా పాల్గొని విజయం సాధించారు.
