సర్ అవకతవకలపై సీఈసీకి గన్నవరం మాజీ ఎమ్మెల్యే లేఖ..
విజయవాడ రూరల్ (వెస్ట్), ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటర్ల జాబితాను మరింత పటిష్టంగా, పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు 71-గన్నవరం నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే డా. వల్లభనేని వంశీ ముందడుగు వేశారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో స్థానికంగా తలెత్తుతున్న సందేహాలు, సాంకేతిక ఇబ్బందులను సామరస్యంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ నెల 12న ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు సమగ్ర ప్రాతినిధ్యం అందజేశారు.
గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు, విజయవాడ రూరల్ నాలుగు మండలాల్లోని 307 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఇంటింటి సర్వే సందర్భంగా తమ పార్టీ పోలింగ్ కేంద్ర స్థాయి ప్రతినిధులు కొన్ని అంశాలను గమనించారని వంశీ తెలిపారు. కొంతమంది ఓటర్ల వివరాల్లో స్పష్టత కోసం తార్కిక వ్యత్యాసాల జాబితాను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. దీనివల్ల ఓటర్లకు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు మరింత స్పష్టత ఏర్పడుతుందని పేర్కొన్నారు.
విజయవాడ రూరల్ మండలంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో, ముఖ్యంగా ప్రసాదంపాడు పరిధిలో గుర్తింపు లేని ఓటర్ల కేసులను మరోసారి సమీక్షించాలని సూచించారు. గతంలో గుర్తించిన కొన్ని నకిలీ నమోదులను వెంటనే సరిచేస్తే ఓటర్ల జాబితా మరింత కచ్చితంగా తయారవుతుందని తెలిపారు. జాతీయ ఓటరు గుర్తింపు సమాచారంతో వివరాలను మరోసారి సరిపోల్చి పరిశీలిస్తే ఇలాంటి చిన్నపాటి సమస్యలను కూడా సులువుగా పరిష్కరించవచ్చని అన్నారు.
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అన్ని రాజకీయ పార్టీల పోలింగ్ కేంద్ర స్థాయి ప్రతినిధులను భాగస్వాములుగా చేస్తే ప్రజల్లో ఈ ప్రక్రియపై మరింత విశ్వాసం పెరుగుతుందని వంశీ అభిప్రాయపడ్డారు. ఈ నెల 30తో ప్రక్రియ గడువు ముగియనున్న నేపథ్యంలో సమస్యలన్నింటినీ సామరస్యంగా పరిష్కరిస్తే 71-గన్నవరం నియోజకవర్గ ఓటర్ల జాబితా దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఓటర్ల జాబితాలో ఒక్క అనర్హుడి పేరు కూడా ఉండకూడదని, అదే సమయంలో ఒక్క అర్హుడి పేరు కూడా గల్లంతు కాకూడదన్నదే తమ లక్ష్యమని వంశీ స్పష్టం చేశారు. తాము సమర్పించిన ప్రాతినిధ్యాన్ని ఎన్నికల సంఘం సానుకూలంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం ఉందన్నారు.ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.ఎన్నికల సంఘానికి సమర్పించిన ప్రాతినిధ్య ప్రతులను ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి, కృష్ణా జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులకు కూడా పంపినట్లు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలిపారు.
