మీ వంటింట్లోనే అందానికి మందు

మీ వంటింట్లోనే అందానికి మందు

హార్మోన్ల అసమతుల్యతతో పెరుగుతున్న అవాంఛిత రోమాల సమస్య
ఇంటి చిట్కాలతో సహజంగా రోమాల తగ్గింపు
పసుపు, శనగపిండి, బొప్పాయితో అందానికి సంరక్షణ
హార్మోన్ల సమతుల్యతకు ఉపయోగపడే ఆహారాలు
ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి?

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌ ; ప్రస్తుతం ఉన్న ఉరుకు, పరుగుల జీవితంలో మారిన జీవనశైలి కారణంగా మహిళల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినటం సర్వసాధరణమైంది. హార్మోన్ల అసమతుల్యత కారణంగా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే కొంతమందిలో ఈ హార్మోన్ల అసమతుల్యత ఆరోగ్య సమస్యలే కాదు.. తమ సౌందర్యానికి కూడా చిక్కులు తెచ్చిపెడుతున్నాయి… ముఖ్యంగా ముఖంపై అవాంఛిత రోమాలు పెదవులపైన, గడ్డం మీద, గడ్డం కింద వచ్చే రోమాలతో బాగా ఇబ్బందులు పడుతున్నారు.

ఈ సమస్య కొందరిలో మాములుగా ఉంటే మరికొందరిలో మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ సమస్య నుంచి తాత్కాలికంగా తప్పించుకోవడానికి కొందరు వ్యాక్సింగ్‌, షేవింగ్ వాడుతుంటారు. మరికొందరు వీటి కోసం స్పెషల్‌ ట్రీట్మెంట్స్‌ తీసుకుంటారు. దీనికి పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్స్‌ లాంటివి తీసుకోకుండా మన ఇంట్లోనే ఉన్న కొన్ని పదార్థాలను ఉపయోగించి వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు. మన డైట్‌లో హార్మోన్ల సమతుల్యతకు మద్దతు ఇచ్చే ఆహారం తీసుకుంటూ తగ్గించవచ్చు… హార్మోన్లను బ్యాలెన్స్‌ చేసే ఆహారం ఏంటో.. ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం రండి..

హార్మోన్ల అసమతుల్యత కారణాలు..

మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత సాధారణంగా అధిక ఆందోళన, ఉద్యోగ భారం, నిద్రలేమి అలాగే మనం తీసుకునే ఆహారంలో ఫాస్ట్ ఫుడ్, శరీరానికి అవసరమైన పోషకాలు తక్కువగా తీసుకోవడం వల్ల ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అధిక షుగర్, ప్రాసెస్ చేసిన ఫుడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ అలాగే థైరాయిడ్ సమస్యలు, PCOS (పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్), వ్యాయామం తక్కువగా చేయడం, సిగరెట్, ఆల్కహాల్ వంటి కారణాలు, అసమతుల్యతకు ప్రధానంగా ఇస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్, ప్రోజెస్టెరాన్, ఇన్సులిన్ లెవల్స్ ప్రభావితం అవుతాయి. మహిళల్లో ఉండే ‘ఈస్ట్రోజన్’ తగ్గి, పురుష హార్మోన్ అయిన ‘ఆండ్రోజన్’ స్థాయి పెరగడం వల్ల ఇలా జరుగుతుంది. ప్రస్తుతం 10 మందిలో ముగ్గురు మహిళలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. దీనివల్ల కూడా ముఖంపై వెంట్రుకలు వస్తాయి. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే అది మీకు కూడా వచ్చే అవకాశం ఉంది.

ఇంటి చిట్కాలతో అవాంఛిత రోమాలకు చెక్!

ఖరీదైన లేజర్ ట్రీట్‌మెంట్స్ లేదా చర్మాన్ని పాడుచేసే కెమికల్ క్రీమ్స్ అవసరం లేకుండా ఈ పద్ధతులు పాటించి చూడండి

1. పసుపు – పాలు:

పసుపులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు చర్మాన్ని రక్షించడమే కాకుండా, క్రమంగా వెంట్రుకల పెరుగుదలను తగ్గిస్తాయి. రెండు స్పూన్ల పసుపులో కొద్దిగా పాలు కలిపి పేస్ట్‌లా చేయండి. దీన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.

2. శనగపిండి – పెరుగు:

ఇది మన అమ్మమ్మల కాలం నాటి సహజ పద్ధతి. ఇది చర్మంపై ఉండే మృతకణాలను తొలగించి, రోమాలను బలహీనపరుస్తుంది. శనగపిండి, పెరుగు, చిటికెడు పసుపు కలిపి ప్యాక్ వేసుకోండి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత, వెంట్రుకలు పెరిగే దిశకు వ్యతిరేకంగా మెల్లగా రుద్దుతూ కడిగేయండి.

3. చక్కెర – నిమ్మరసం :

ఇది ఒక సహజసిద్ధమైన వ్యాక్సింగ్ పద్ధతి. రెండు స్పూన్ల చక్కెరను కొద్దిగా నిమ్మరసం, నీటితో కలిపి వేడి చేయండి. అది జిగురుగా మారిన తర్వాత చల్లార్చి, రోమాలు ఉన్న చోట అప్లై చేసి మెల్లగా లాగేయండి. ఇది వేర్ల నుండి వెంట్రుకలను తొలగిస్తుంది.

4. పచ్చి బొప్పాయి – పసుపు :

బొప్పాయిలో ఉండే ‘పాపైన్’ అనే ఎంజైమ్ హెయిర్ ఫోలికల్స్‌ను విచ్ఛిన్నం చేస్తుంది. పచ్చి బొప్పాయి ముక్కను మెత్తగా చేసి అందులో పసుపు కలపండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఆహారంలో మార్పులు కూడా అవసరమే..

కేవలం ప్యాక్‌లు వేస్తే సరిపోదు, లోపల నుండి హార్మోన్లను బ్యాలెన్స్ చేయాలి. పుదీనా టీని రోజుకు రెండు సార్లు తాగడం వల్ల మహిళల్లో ఆండ్రోజన్ స్థాయిలు తగ్గి, అవాంఛిత రోమాలు రావడం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అల్మండ్స్ & నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ హార్మోన్లను క్రమబద్ధీకరిస్తాయి. సోయా ఉత్పత్తులు ఈస్ట్రోజన్ స్థాయిని పెంచడంలో సహాయపడతాయి.

ఈ చిట్కాలు సహజమైనవి కాబట్టి ఫలితం రావడానికి కొంచెం సమయం పడుతుంది. ఓపికగా పాటించాలి. ఒకవేళ సమస్య చాలా తీవ్రంగా ఉంటే మాత్రం ఎండోక్రినాలజిస్ట్ లేదా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించి హార్మోన్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

CLICK HERE TO READ అవకాడోతో ముఖం మిలమిల!

CLICK HERE TO READ MORE

Leave a Reply