విద్యకు అండగా.. ఎమ్మెల్యే యరపతినేని
గురజాల, ఆంధ్రప్రభ : గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రజల ప్రశంసలు పొందుతున్నారు. కష్ట కాలంలో నేనున్నానంటూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తూ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మన్ననలు పొందుతున్నారు.
మాచవరం మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన పోతురాజు వెంకటేశ్వర్లు ఇటీవల మాచవరంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తన ఆర్థిక పరిస్థితి, మనవరాలు నాగమల్లేశ్వరి చదువుకు ఎదురవుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే.. విద్యార్థిని బీటెక్ చదువు పూర్తి చేసేందుకు అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం శనివారం గోవిందాపురంలోని వెంకటేశ్వర్లు ఇంటికి ఎమ్మెల్యే స్వయంగా వెళ్లారు. నాగమల్లేశ్వరికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించడంతో పాటు ఆమె బీటెక్ చదువు, హాస్టల్ ఫీజులకు సంబంధించిన మొత్తం రూ.3.17 లక్షలను కళాశాల యాజమాన్యానికి చెల్లిస్తానని హామీ ఇచ్చారు. వెంకటేశ్వర్లుకు రెండు జతల దుస్తులను అందించి కుటుంబ సభ్యుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు.
నాగమల్లేశ్వరి తల్లి మృతి చెందగా, తండ్రి మరో వివాహం చేసుకోవడంతో చిన్నప్పటి నుంచి అమ్మమ్మ, తాతయ్యల వద్దే పెరుగుతోంది. ప్రస్తుతం గుంటూరులోని మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫీజు చెల్లించలేని పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆమె చదువుకు అండగా నిలిచారు.
దివ్యాంగుడి కుటుంబానికి నెలనెలా సాయం
గురజాల మండలం మాడుగుల గ్రామపంచాయతీ పరిధిలోని జనార్దనపురానికి చెందిన ప్రసాద్ అనారోగ్యంతో శాశ్వతంగా మంచానికే పరిమితమయ్యారు. ఆయన కుటుంబానికి కూడా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు భరోసా కల్పించారు. ప్రభుత్వ పథకం అందే వరకు ప్రతి నెలా రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆపద సమయంలో అండగా నిలిచిన ఎమ్మెల్యేకు జనార్దనపురం వాసులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలపై అవగాహన
గోవిందాపురంలో ‘రెండేళ్ల నమ్మకం’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే యరపతినేని ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.
కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామ యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
