రాష్ట్ర సుభిక్షం కోసం దుర్గమ్మకు ఆషాఢ సారె
- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా సమర్పణ
- 300 మంది ప్రతినిధులతో మేళతాళాల నడుమ ర్యాలీ..
- అమ్మవారికి నాలుగు పట్టు చీరలు సమర్పణ
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి కరుణాకటాక్షాలు లభించాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించారు. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్‌శర్మ ఆధ్వర్యంలో సుమారు 300 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రావిచెట్టు సెంటర్ నుంచి మేళతాళాల నడుమ సారెను ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి తీసుకువచ్చారు. ప్రోటోకాల్ కార్యాలయం వద్ద దేవస్థానం ఏఈవో గంగాధర్ సమాఖ్య ప్రతినిధులకు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయంలోని ఆరో అంతస్తులో అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించారు. అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు.
ఈ సందర్భంగా అమ్మవారికి నాలుగు పట్టు చీరలను సమర్పించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు కోనూరు సతీష్‌శర్మ తెలిపారు.
దేశంలోనే శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ సారె సమర్పించినట్లు చెప్పారు.
కార్యక్రమంలో సమాఖ్య ప్రధాన కార్యదర్శి హెచ్.కె. మనోహరరావు, అడ్వైజరీ కమిటీ చైర్మన్ సత్యవాడ దుర్గాప్రసాద్, ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ జాతీయ సలహాదారు పెద్దిభొట్ల లక్ష్మీనారాయణ, ఏఐబీఎఫ్ కోశాధికారి తిప్పావజ్జుల నారాయణశర్మ, వి.పాండురంగ విఠల్, జొన్నలగడ్డ సూర్యకాంతం, కామరాజుగడ్డ కుసుమ, గరుడాద్రి దత్తాత్రేయశర్మ, మేళ్లచెరువు శివకుమార్‌శర్మ, పిడతల భారతి, పప్పు సరోజిని, మారేపల్లి అర్చన, సూరంపూడి కామేష్, హెచ్.కె.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
