ఏరోబిక్ జిమ్నాస్టిక్స్‌లో చరిత్ర సృష్టించిన అరిహా
ఆంధ్రప్రభ : భారత ఏరోబిక్ జిమ్నాస్టిక్స్‌లో అరిహా పంగంబం చరిత్ర సృష్టించారు. ఆసియా ఏరోబిక్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సీనియర్ మహిళల వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచారు. ఫిలిప్పీన్స్‌లో జరిగిన పోటీల ఫైనల్లో అరిహా 19.100 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు.
ఫైనల్లో అరిహా కళాత్మక ప్రదర్శనకు 8.650, అమలుకు 7.600, కఠినతకు 2.850 పాయింట్లు లభించాయి. గత ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వల్ప తేడాతో నాలుగో స్థానంలో నిలిచిన అరిహా.. ఈసారి పతకమే లక్ష్యంగా సాధన కొనసాగించారు.
పదో ఆసియా ఛాంపియన్‌షిప్‌లో తొలి స్వర్ణం
గత పోటీల్లో నాలుగో స్థానంతో పతకాన్ని తృటిలో చేజార్చుకోవడం తనను ఎంతో నిరాశకు గురిచేసిందని అరిహా తెలిపారు. అదే నిరాశను ప్రేరణగా మార్చుకుని తదుపరి పోటీలకు సిద్ధమైనట్లు చెప్పారు. రోజూ ఉదయం, సాయంత్రం కలిపి సుమారు ఆరు గంటలు శిక్షణ తీసుకున్నానని అరిహా వెల్లడించారు. తన విజయానికి కోచ్, తల్లిదండ్రుల సహకారం కూడా ఎంతో కీలకమని పేర్కొన్నారు. “ఈ పతకం నాకు మాత్రమే కాదు.. మొత్తం దేశానికి ఎంతో ప్రత్యేకం. నా ప్రదర్శన ద్వారా న్యాయనిర్ణేతలు, ప్రేక్షకులకు నేను చెప్పాలనుకున్న విషయాన్ని అర్థమయ్యేలా చేయాలని ఎప్పుడూ ప్రయత్నించాను” అని అరిహా పేర్కొన్నారు.
ఈ విజయం భారత ఏరోబిక్ జిమ్నాస్టిక్స్‌కు కీలక మైలురాయిగా నిలిచింది. ఆసియా ఛాంపియన్‌షిప్ పదో ఎడిషన్‌లో భారత్‌కు ఈ విభాగంలో తొలి స్వర్ణం లభించింది. భారత బృందంలో 50 మంది క్రీడాకారులు ఉన్నారని ప్రతినిధి బృందం అధిపతి ఇంద్రజీత్ సింగ్ రాథోర్ తెలిపారు. అరిహా స్వర్ణంతో పాటు సీనియర్ ఏరో స్టెప్ విభాగంలో భారత్‌కు కాంస్య పతకం కూడా లభించింది. దీంతో ఈ పోటీల్లో భారత్ ఒక స్వర్ణం, ఒక కాంస్యంతో తన ప్రస్థానాన్ని ముగించింది.
ఏరోబిక్ జిమ్నాస్టిక్స్‌కు భారత్‌లో ఇంకా విస్తృతంగా ఆదరణ లేనప్పటికీ ఈ విజయం తర్వాత మరింత మంది పిల్లలు, తల్లిదండ్రులు ఈ క్రీడ వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉందని రాథోర్ అన్నారు. ఈ విజయంతో దేశంలో ఏరోబిక్ జిమ్నాస్టిక్స్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు పదేళ్లుగా ఈ విభాగంలో భారత బృందం చేస్తున్న కృషికి అరియాహా విజయం ఫలితమని రాథోర్ తెలిపారు. యువ స్థాయి నుంచి సీనియర్ స్థాయికి ఎదిగిన అరియాహా.. కీలక వేదికపై అద్భుత ప్రదర్శనతో దేశానికి చారిత్రక స్వర్ణాన్ని అందించారు.
