డీఎస్సీ అక్రమాలపై వైసీపీ రిలే నిరాహార దీక్ష
వినుకొండ, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, మోసపోయిన ప్రతి ఒక్కరూ రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో శనివారం వినుకొండలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కారంపూడి రోడ్డులోని బ్రహ్మనాయుడు కన్వెన్షన్ హాల్ ఎదుట ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో బ్రహ్మనాయుడు పాల్గొని మాట్లాడారు.
మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, దొడ్డిదారిన కొందరికి ఉద్యోగాలు కల్పించారని ఆయన ఆరోపించారు. నకిలీ ధ్రువపత్రాలతో అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారంటూ విమర్శించారు. క్రీడల కోటాలో పతకాలు సాధించిన అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
నూజెండ్లలో డీఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష చేపడుతుండగా పోలీసులు శిబిరాన్ని తొలగించడం దుర్మార్గమని బ్రహ్మనాయుడు అన్నారు. టీడీపీ నాయకులు పోలీసులను వెంటబెట్టుకుని వచ్చి దీక్షా శిబిరం వద్ద హడావుడి చేశారని ఆరోపించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనే కారణంతో దీక్షను అడ్డుకోవడం సరికాదన్నారు.
నిరుద్యోగ భృతి ఏమైంది?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని బ్రహ్మనాయుడు విమర్శించారు. నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చిన పింఛన్ల హామీలు ఏమయ్యాయని నిలదీశారు. బీసీ, కాపు నేస్తం, చేతివృత్తిదారులు, ఆటో కార్మికులు, న్యాయవాదులకు సంబంధించిన పథకాలపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎస్సీలో అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటామని, అక్రమంగా ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ జరిపిస్తామని అన్నారు.
తాగునీటి సమస్యను పరిష్కరించాలి
బొల్లాపల్లి మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని బ్రహ్మనాయుడు తెలిపారు. ఆయా గ్రామాలకు తక్షణమే ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వినుకొండ పట్టణంలోనూ తాగునీటికి బదులు మురుగునీరు వస్తోందని ఆరోపించారు. పట్టణ తాగునీటి పథకానికి సంబంధించి ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు.
వారికపూడిశల ప్రాజెక్టును తీసుకురాకపోగా బనకచర్ల ప్రాజెక్టు పేరుతో బొల్లాపల్లి రైతుల్లో ఆందోళన నెలకొందని అన్నారు. ప్రాజెక్టుల పేరుతో రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. గోనుగుంట్లవారిపాలెం గ్రామానికి చెందిన రాజు హత్య కేసులో వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
‘శివయ్య స్తూపం ఎవరి జాగీరు కాదు’
వినుకొండలోని శివయ్య స్తూపం సెంటర్ ఏ ఒక్క పార్టీకి చెందినది కాదని బ్రహ్మనాయుడు అన్నారు. అక్కడ అన్ని పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు గతంలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు నిర్వహించారని గుర్తుచేశారు. తమకు అక్కడ రిలే నిరాహార దీక్ష నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవడం సరికాదన్నారు.
కారంపూడి రోడ్డులోని బ్రహ్మనాయుడు కన్వెన్షన్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని మున్సిపల్ అధికారులు తొలగించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును కాపాడాలని కోరారు.
కార్యక్రమంలో వైసీపీ పరిశీలకులు బాసు లింగారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ అమ్మిరెడ్డి అంజిరెడ్డి, న్యాయవాది ఎం.ఎన్.ప్రసాద్‌తో పాటు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
