సొంత ఖర్చుతో క్రీడాకారులకు తర్ఫీదు
మక్తల్, ఆంధ్రప్రభ: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యం ఇస్తారు. అయితే దీనికి భిన్నంగా 70 ఏళ్ల విశ్రాంత పీఈటీ బి. గోపాలం గత పదేళ్లుగా క్రీడారంగానికి స్వంత ఖర్చులతో ఉచిత సేవలు అందిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలల్లో 4వ తరగతిలో ప్రవేశం కోసం ప్రస్తుతం 3వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. మక్తల్ మండలానికి చెందిన మొత్తం 15 మంది బాలబాలికలకు గోపాలం శిక్షణ అందిస్తున్నారు. వీరిలో మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని జిపి ప్రాథమిక పాఠశాల నుంచి ఎస్జీటీ టీచర్, జాతీయ స్థాయి క్రీడాకారిణి బి. దీప ఆధ్వర్యంలో 8 మంది, ఇతర పాఠశాలల నుంచి 7 మంది ఉన్నారు.
ఈ నెల 10వ తేదీ నుంచి వారికి ఉచితంగా క్రీడా దుస్తులు అందజేసి, క్రీడా పాఠశాల ఎంపికకు సంబంధించిన తొమ్మిది క్రీడా అంశాల్లో మెరుగైన శిక్షణ ఇస్తున్నారు. గత 25 సంవత్సరాల్లో మక్తల్ నియోజకవర్గం నుంచి 76 మంది బాలబాలికలను వివిధ క్రీడా పాఠశాలలకు పంపినట్లు గోపాలం తెలిపారు.
“ప్రభుత్వం నిర్వహించాల్సిన శిక్షణ శిబిరం ఇది. కానీ నాకు క్రీడలంటే, క్రీడాకారులంటే ఎంతో అభిమానం. పేద విద్యార్థులు క్రీడా పాఠశాలల్లో చేరాలనే తపనతో వారికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాను” అని గోపాలం వెల్లడించారు.
ఈ నెల 31న నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగే క్రీడా పాఠశాల ఎంపికలో విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి ఎంపికలకు అర్హత సాధించేలా, ఈ నెల 30 వరకు శిక్షణ కొనసాగిస్తానని తెలిపారు. విద్యార్థులు ఈ శిక్షణలో ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు. బాలబాలికలకు నిస్వార్థంగా శిక్షణ అందిస్తున్న బి. గోపాలంను తల్లిదండ్రులు అభినందిస్తున్నారు.
