ATM Cash Theft |రూ.17లక్షలతో పరారైంది తండ్రీ కొడుకులే…

ATM Cash Theft | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పాతబస్తీ ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన రూ.17లక్షల ఏటీఎం నగదు చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో డ్రైవర్ శ్రీనివాస్‌తో పాటు అతని కుమారుడి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఏటీఎంలో నగదు రీఫిల్లింగ్ జరుగుతున్న సమయంలో డ్రైవర్ శ్రీనివాస్ నగదు బ్యాగ్‌ను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ చోరీకి ముందుగానే తన కుమారుడితో కలిసి పక్కా ప్రణాళిక రూపొందించినట్లు విచారణలో వెల్లడైంది.

నగదు బ్యాగ్‌తో బయటకు వచ్చిన శ్రీనివాస్, తన కుమారుడితో కలిసి బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం ఉప్పుగూడలో నివసిస్తున్న మరో కుమారుడికి కూడా దొంగిలించిన నగదులో కొంత మొత్తం ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు జగిత్యాల సమీపంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించి నగదు స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.