మహంకాళి ఆలయంలో సంప్రోక్షణ పూజలు..
బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : బాసర పుణ్యక్షేత్రంలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఉప ఆలయమైన శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఇటీవల చోటుచేసుకున్న చోరీ ఘటన అనంతరం ఆలయ వైదిక సిబ్బంది, వేద పండితులు మంగళవారం సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు.
అమ్మవారి కిరీటం, హుండీని గుర్తుతెలియని దుండగులు పగులగొట్టి నగదు అపహరించిన నేపథ్యంలో ఆలయాన్ని గంగాజలంతో శుద్ధి చేసి సంప్రోక్షణ చేపట్టారు. అనంతరం ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్ ఆధ్వర్యంలో వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారికి హారతులు ఇచ్చి, నైవేద్యం సమర్పించి భక్తుల శాంతి, క్షేమాల కోసం ప్రార్థనలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో అంజనీదేవి, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
