వనపర్తి ప్రతినిధి, ఫిబ్రవరి 27(ఆంధ్ర ప్రభ):గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచెత్తడంతో, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలకు అన్ని పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర అబ్కారి, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.గురువారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, స్థానిక శాసన సభ్యులు తూడి మేఘారెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా మంత్రి. జూపల్లి మాట్లాడుతూ మార్చి 2న వనపర్తి నియోజకవర్గంలో రూ.721 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నారని అన్నారు.వైఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయంలో శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగo పనులు 2006లో ప్రారంభించడం జరిగిందని,దాదాపు 44కి. మీ సొరంగం పనులకు గాను..25కి.మీ పనులు కాంగ్రెస్ హయాంలోనే పూర్తి కావడం జరిగిందన్నారు. 10ఏండ్ల కేసీఆర్ పాలనలో 11కి. మీ మాత్రమే సొరంగం పనులు పూర్తి చేశారని..రూ. 8లక్షల కోట్లు అప్పులు చేసి కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల్లో సొరంగం పనులు పూర్తి చేసిన కేసీఆర్.. ఈ పనులు ఎందుకు చేయలేదని జూపల్లి ప్రశ్నించారు.
ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 3లక్షలకు ఎకరాలకు సాగునీరు అందుతుందని, కాంగ్రెస్ కు పేరు వస్తుందనే ఈ పనులు కేసీఆర్ చేపట్టలేదని విమర్శించారు.తక్కువ ఖర్చుతో ఎలాంటి విద్యుత్ సమస్య లేకుండా సాగునీరు అందించే అవకాశం ఉంటుందని, సమస్యను పరిష్కరించే దిశగా సీఎం. రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. మాజి మంత్రి. హరీష్ రావు శ్రీశైలం సొరంగం సందర్శించి ,ప్రమాదంలో చనిపోయిన సీఎం. రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని అనడం సిగ్గు చేటన్నారు. గత ప్రభుత్వ హయంలో కాళేశ్వరం, పాలమూరు -రంగారెడ్డి, శ్రీశైలం పవర్ హౌస్ లో చనిపోతే కేసీఆర్ ఏనాడైన సందర్శించారా అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు గురించి ప్రశ్నించే అర్హత కేసీఆర్, హరీష్ రావు , ఇతర బిఆర్ఎస్ నేతలకు లేదన్నారు.ప్రమాద ఘటనకు సంబంధించి బాధితులను కాపాడడం కోసం నేవీ, ఎన్డీఆర్ఎఫ్ సహా 11 సంస్థలను రఫ్పించి బాధితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందన్నారు.
టన్నెల్ లో 11.8 కిలోమీటర్ల లోనికి తాను కూడా వెళ్లానని, అక్కడ భయానక పరిస్థితి నెలకొందన్నారు. దేశంలోని వివిధ సంస్థల ద్వారా నిష్ణాతులను పిలిపించి సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. సీఎం ఘటన స్థలికి రాకపోయినప్పటికీ ప్రతి రోజూ సహాయ కార్యక్రమాలపై సమీక్షిస్తున్నారన్నారు.గత పదేళ్ల కాలంలో కేసీఆర్ ఏనాడైన అంబేద్కర్ కు పూల మాల వేశాడా అని ప్రశ్నించారు.వనపర్తిలో ఎమ్మెల్యే మేఘా రెడ్డి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు.మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి వనపర్తికి రాబోతున్నారని, తాను చదివిన పాఠశాల అభివృద్ధి సహా రూ.721 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి 14 నెలల్లో విద్యా, వైద్య, క్రీడల పరంగా సుమారు రూ.1000 కోట్ల అభివృద్ధి పనులను వనపర్తికి తెప్పించగలిగారన్నారు. జాబ్ మేళా, రుణమేళా, స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారని, సుమారు వెయ్యి మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించే పని చేస్తున్నారన్నారు. మొదటి సారి శాసనసభ్యులు అయినప్పటికీ నిత్యం ప్రజలతో ఉంటూ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారన్నారని మంత్రి. జూపల్లి కొనియాడారు.
వెయ్యి మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అవకాశాలు :ఎంపీ. మల్లు రవి
ప్రభుత్వం అమలు చేసిన 6గ్యారంటీలో 5గ్యారంటీలు అమలు చేయడం జరిగిందని.. వనపర్తిలో జాబ్ మేళా, రుణమేళా, స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలతో సుమారు వెయ్యి మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించే పని చేస్తున్నామని ఎంపీ మల్లు రవి అన్నారు.సీఎం వనపర్తిలో చదువుకున్న నేపథ్యంలో, ఆయనకు ఇక్కడి ప్రాంతంలో మంచి అనుబంధం ఉన్న కారణంగా వనపర్తి అసెంబ్లీ అభివృద్ధి కోసం రూ.721 కోట్లతో శంకుస్థాపనలు చేయబోతున్నారన్నారు. సీఎం రేవంత్ ఆయనతో చదువుకున్న వారందరితో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొననున్నారన్నారు. ఆయన ఇక్కడి ఉన్నప్పుడు పార్వతమ్మ అనే వారి ఇంట్లో ఉండి చదవుకున్నారని, వారి ఇంటికి కూడా సీఎం రాబోతున్నారన్నారని మల్లు రవి అన్నారు.
తాను చదువుకున్న ఊరికి తొలిసారి రానున్న సీఎం. రేవంత్ రెడ్డి :ఎమ్మెల్యే. మేఘా రెడ్డి
ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ సీఎం గా పదవి చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తాను చదువుకున్న ఊరికి తొలిసారి రానున్నారని తెలిపారు.14 నెలల కాలంలో వనపర్తిలో రూ.397 కోట్లతో అభివృధ్ది కార్యక్రమాలకు సహకారం అందించారన్నారు.మార్చి 2 తేదీన రూ.721 కోట్లకు సంబంధించి శంకుస్థాపనలుచేయబోతున్నారని చెప్పారు. వనపర్తిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అభివ్రుద్ధికి రూ.1 కోటితో శంకుస్థాపన చేయనున్నారన్నారు. రూ.257 కోట్లతో హాస్పిటల్ నిర్మాణానికి,రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. రూ.60 కోట్లతో తాను చదువుకున్న జడ్పీ స్కూల్,జూనియర్ కళశాల అభివృద్ధి కి శంకుస్థాపన చేయనున్నారన్నారు. రూ.22 కోట్లతో ఐటీ టవర్ కు, రూ. 81 కోట్లతో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి, రాజనగరం నుంచి పెద్దమందడి రోడ్డుకు రూ.40 కోట్లతో శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు.సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, డిసిసి రాజేంద్రప్రసాద్, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.