హెల్మెట్ ఉంటే సరిపోదు.. క్లిప్ తప్పనిసరి!

హెల్మెట్ ఉంటే సరిపోదు.. క్లిప్ తప్పనిసరి!
పాయకాపురం, ఆంధ్రప్రభ : హెల్మెట్ ఉంటే సరిపోదు.. క్లిప్ తప్పనిసరి అని అజిత్ సింగ్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐ ప్రభాకర్ అన్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా విజయవాడ ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అజిత్ సింగ్ నగర్ ట్రాఫిక్ సిఐ ప్రభాకర్ మంగళవారం స్థానిక బుడమేరు సెంటర్ వద్ద వాహనదారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేవలం తలపై హెల్మెట్ పెట్టుకుంటే సరిపోదని, దానికి ఉండే క్లిప్ లాక్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సిఐ సూచించారు.
క్లిప్ లేని హెల్మెట్ ప్రమాద సమయంలో తల నుండి విడిపోయి, ప్రాణాపాయానికి దారితీస్తుందని హెచ్చరించారు. బుడమేరు సెంటర్ మీదుగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులను ఆపి, హెల్మెట్ క్లిప్ ప్రాముఖ్యతను స్వయంగా వివరించారు. నిబంధనలు పాటించని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను ఒక బాధ్యతగా భావించాలని, ఇది పోలీసుల కోసం కాదని, మీ కుటుంబాల భద్రత కోసమని ఆయన పేర్కొన్నారు.
చాలామంది వాహనదారులు జరిమానాల నుండి తప్పించుకోవడానికి మాత్రమే హెల్మెట్ ధరిస్తున్నారు. కానీ ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ తలకే ఉండి ప్రాణాలను కాపాడాలంటే క్లిప్ లాక్ చేయడం అత్యవసరం. నిర్లక్ష్యాన్ని వీడి, ప్రతి ఒక్కరూ క్లిప్ ధరించి సురక్షిత ప్రయాణం సాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై కృష్ణ సిబ్బందితో పాటు పలువురు వాహనదారులు పాల్గొన్నారు. పోలీసులు తీసుకున్న ఈ చొరవపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
