TG | బాధితులకు అండగా ఉంటాం…

TG | బాధితులకు అండగా ఉంటాం…

TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో భూకబ్జాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభావాన్ని ఉపయోగించి భూములను ఆక్రమిస్తున్నారని, అధికారులను అడ్డుపెట్టుకుని అక్రమాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. వట్టినాగులపల్లిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి పర్యటించిన కేటీఆర్, భూకబ్జా బాధితులను పరామర్శించి వారికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సతీశ్ షా కుటుంబం దశాబ్దాలుగా నివసిస్తున్న విలువైన భూమిపై కన్నేసి, బెదిరింపులకు దిగారని ఆరోపించారు. భూమిని ఇవ్వబోమని చెప్పడంతో ఒత్తిడులు పెంచి, జేసీబీలతో గోశాలలు, కాంపౌండ్ గోడలను ధ్వంసం చేశారని తెలిపారు. ఒక నిజాయితీ గల పోలీస్ అధికారిని బాధితులకు మద్దతుగా నిలిచినందుకు వెంటనే బదిలీ చేశారని కూడా విమర్శించారు.

రాష్ట్రంలో పెద్దఎత్తున భూకబ్జాలు జరుగుతున్నాయని, వేల ఎకరాలు అక్రమంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేటీఆర్ అన్నారు. కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చడం వెనుక కూడా అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈ అంశంపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమాలపై సభాసంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన కేటీఆర్, ఆయన రాజీనామా చేస్తేనే సీబీసీఐడీ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందని పేర్కొన్నారు. భూకుంభకోణాలు, మైనింగ్ అక్రమాలపై పూర్తిస్థాయిలో పోరాడుతామని హెచ్చరించారు.