పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి.. జీపీ కార్మికుల ధర్నా
కడెం, ఆంధ్రప్రభ: గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేసి, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని జీపీ కార్మికులు సోమవారం కడెం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీవో శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) మండల అధ్యక్షుడు పోషలింగు మాట్లాడుతూ, గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు విడుదల చేయడం, కనీస వేతనాలు అమలు చేయడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం తదితర డిమాండ్లతో వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.
మండలంలోని గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.18 వేల కనీస వేతనం అమలు చేయాలని, కార్మికులందరినీ రెగ్యులర్ చేసి ఈఎస్ఐ, పీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
జీవో నంబర్ 51ను సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రతి కార్మికుడి వేతనాన్ని వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలోనే గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 1వ తేదీన జమ చేయాలని కోరారు.
విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా, రూ.10 లక్షల ప్రమాద బీమా, అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.30 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి రమేష్, నాయకులు నవీన్, అజయ్, రాజన్న, మహేష్, శాంబయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.
