పెద్దపోర్లలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’

పెద్దపోర్లలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’

ఊట్కూర్, ఆంధ్రప్రభ:
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపోర్ల రైతువేదిక భవనంలో గురువారం సర్పంచ్ బోయిన్‌పల్లి కాశమ్మ అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ భానుశ్రీ మాట్లాడుతూ.. రైతులు ప్రధానంగా యూరియా వాడకాన్ని తగ్గించి, జీవ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. తద్వారా సాగు ఖర్చును తగ్గించుకోవడమే కాకుండా, నేల ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని తెలిపారు. అధిక రసాయనాల వాడకం వల్ల నేలకు, పంటలకు, తద్వారా మనుషులకు కలిగే నష్టాలను ఆమె కూలంకషంగా వివరించారు. పంట మార్పిడి యొక్క ప్రాధాన్యతను గుర్తు చేస్తూ.. అధిక దిగుబడినిచ్చే విశ్వవిద్యాలయ ప్రముఖ వరి వంగడాల గురించి రైతులకు అవగాహన కల్పించారు.

నీటి పొదుపు పద్ధతులను పాటిస్తూ, సేంద్రియ వ్యవసాయం ద్వారా సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. రైతులు పంటల సాగులో ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏఈఓ చరణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి రాకేష్, స్థానిక నాయకుడు బోయిన్‌పల్లి నరేష్, ఆదర్శ రైతులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply