భవనంపై నుండి జారిపడి యువకుడు మృతి

భవనంపై నుండి జారిపడి యువకుడు మృతి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ:
నిద్రమత్తులో ప్రమాదవశాత్తు భవనం మూడవ అంతస్తు నుండి కిందపడి ఓ నిర్మాణ రంగ కార్మికుడు (మేస్త్రి) మృతి చెందిన ఘటన చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన సీతారాం (24) బతుకుదెరువు నిమిత్తం ఐదు నెలల క్రితం చౌటుప్పల్‌కు వచ్చాడు. ఇక్కడి బంగారిగడ్డలో నివాసముంటూ మేస్త్రి పని చేస్తున్నాడు.

తంగడపల్లి రోడ్డులోని సత్యనారాయణ వెంచర్‌లో జరుగుతున్న ఒక ఇంటి నిర్మాణ పనుల వద్దకు సోమవారం రాత్రి తన వరుసకు అన్న అయిన రాజు యాదవ్‌ను కలవడానికి సీతారాం వెళ్లాడు. రాత్రి అందరూ కలిసి భవనం మూడవ అంతస్తుపై పడుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున రాజు యాదవ్ లేచి చూడగా పక్కన తమ్ముడు కనిపించలేదు. చుట్టుపక్కల వెతకగా బిల్డింగ్ లోపల లిఫ్ట్ కోసం తీసిన గుంతలో (గ్రౌండ్ ఫ్లోర్‌లో) సీతారాం పడి ఉండటాన్ని గమనించారు.

వెంటనే స్థానికుల సహాయంతో చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అర్ధరాత్రి సమయంలో టాయిలెట్‌కు లేచి నిద్రమత్తులో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడటంతో తలకు బలమైన గాయమై చనిపోయినట్లు భావిస్తున్నారు. మృతుని అన్న రాజు యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

Leave a Reply