ప్రభుత్వ విజయాలను 50 లక్షల కుటుంబాలకు చేర్చిన ఘనత కార్యకర్తలదే

  • కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి
  • మాజీ మంత్రి దేవినేని ఉమా

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు అందించిన భరోసా, సంక్షేమం, అభివృద్ధి ఫలాలను 50 లక్షల కుటుంబాలకు చేర్చడంలో కార్యకర్తల పాత్ర కీలకమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన యూనిట్ ఇన్‌చార్జిల శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని పార్టీ బలోపేతం, ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.

“ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం” కార్యక్రమాన్ని విజయవంతం చేసి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ వివరించాలని దేవినేని ఉమా సూచించారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రజలకు సూటిగా వివరించడంతో పాటు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పికొట్టాలని అన్నారు. ప్రత్యర్థుల విమర్శలకు భావోద్వేగాలకు లోనుకాకుండా వాస్తవాలు, గణాంకాలు, గత అనుభవాల ఆధారంగా సమర్థవంతంగా సమాధానం ఇవ్వాలని కార్యకర్తలకు సూచించారు.

ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి ప్రభుత్వంపై మరింత విశ్వాసాన్ని పెంచేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలమని పేర్కొన్న దేవినేని ఉమా, ప్రతి కార్యకర్త నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వారధిగా నిలవాలని అన్నారు. శిక్షణా కార్యక్రమాల ద్వారా రాజకీయ అవగాహన, నాయకత్వ సామర్థ్యం, ప్రజలతో మమేకమయ్యే నైపుణ్యాన్ని మరింత పెంచుకోవాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రతి కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు.