హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌పై అవగాహనకు ప్రచార రథం..
- కళాజాత, ఎల్‌ఈడీ స్క్రీన్ ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్
ఏలూరు, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు కళాజాత, ఎల్‌ఈడీ స్క్రీన్ ప్రచార రథాన్ని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి గురువారం స్థానిక ఇండోర్ స్టేడియంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సి.హెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ… యువత హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌పై అవగాహన కలిగి, అపోహలకు దూరంగా ఉండాలని సూచించారు. హెచ్‌ఐవీ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన ప్రవర్తనను పాటించాలని తెలిపారు.
అనుమానం ఉన్నప్పుడు సమీపంలోని ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కళాజాత ప్రచార రథం ద్వారా జిల్లాలో 10 రోజుల పాటు, ఎల్‌ఈడీ స్క్రీన్ ప్రదర్శనల ద్వారా 15 రోజుల పాటు, ఎయిడ్స్ నియంత్రణ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో 60 రోజుల పాటు అన్ని మండలాలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్ మాల్స్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జనసంచారం అధికంగా ఉండే ముఖ్య కూడళ్లలో ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
ఎల్‌ఈడీ స్క్రీన్లు, కళారూపాలు, పాటలు, నాటికలు, ఇతర ప్రజా ప్రదర్శనల ద్వారా అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ.. హెచ్‌ఐవీతో జీవిస్తున్న వ్యక్తుల పట్ల వివక్ష చూపకుండా వారికి సామాజికంగా అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు ఆరోగ్యంపై సరైన సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు.
కళాజాత, ఎల్‌ఈడీ స్క్రీన్ ప్రచార రథం ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రజా ప్రదర్శనలు నిర్వహించి హెచ్‌ఐవీ–ఎయిడ్స్ నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరీక్షలు, చికిత్స తదితర అంశాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు. యువత బాధ్యతాయుతమైన ప్రవర్తనను అలవర్చుకుని ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సి.హెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. శ్రీదేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. యు. శోభ, క్లస్టర్ ప్రోగ్రామ్ అధికారి జె. శ్యామ్‌సన్, జిల్లా ఎయిడ్స్ సహాయ నియంత్రణ అధికారి ఎస్. విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, కళాజాత కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
