40 ఏళ్లుగా అద్దె ఇల్లే.. మాకు ‘డబుల్’ ఇల్లు దక్కదా?

40 ఏళ్లుగా అద్దె ఇల్లే.. మాకు ‘డబుల్’ ఇల్లు దక్కదా?
- లక్కీ డ్రా వేదికపై నిరుపేద మహిళల కన్నీటి పర్యంతం
- సబ్ కలెక్టర్, తహసీల్దార్, మున్సిపల్ చైర్‌పర్సన్‌ను నిలదీసిన మహిళలు
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: “నలభై ఏళ్లుగా కూలి పని చేసుకుంటూ అద్దె ఇళ్లలోనే బతుకుతున్నాం.. అన్ని అర్హతలు ఉన్నా మాకు ఇల్లు ఎందుకు ఇవ్వరు? పేదల ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా?” అంటూ నిరుపేద మహిళలు దాసరి గంగేశ్వరి, జలంపల్లి ఆశమ్మలు అధికారుల ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. బుధవారం బెల్లంపల్లి పద్మశాలి భవన్‌లో జరిగిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లక్కీ డ్రాలో తమ పేరు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన వీరు, నేరుగా వేదికపైకి వెళ్లి సబ్ కలెక్టర్ మనోజ్, మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి, తహసీల్దార్ కృష్ణలను నిలదీశారు.
పదో వార్డు రైల్వే గడగంభాల బస్తీకి చెందిన జలంపల్లి ఆశమ్మ కన్నీరుమున్నీరవుతూ.. తన భర్త చనిపోయాడని, ఇళ్లలో పాచిపని చేస్తూ అద్దె ఇంట్లో ఉంటున్నానని, తనలాంటి దిక్కులేని వారికి ఇల్లు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారని ప్రశ్నించారు. మరో మహిళ దాసరి గంగేశ్వరి మాట్లాడుతూ.. తన భర్త రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచాన పడ్డారని, నాలుగు దశాబ్దాలుగా అద్దె కొంపలోనే మగ్గుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను పట్టించుకోలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తోందని, సంపన్నుల కోసమే ప్రభుత్వం ఉందా? అని అధికారులను నిలదీశారు. అన్ని అర్హతలు ఉన్నా తమను జాబితా నుంచి ఎందుకు పక్కన పెట్టారని వారు ప్రశ్నించిన తీరు అక్కడ ఉన్న వారిని కలచివేసింది. కన్నీటి పర్యంతమైన ఆ మహిళలను అధికారులు సముదాయించే ప్రయత్నం చేసినా, తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని వారు పేర్కొన్నారు. మరి ఈ నిరుపేదల ఆవేదనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
