మంత్రి తుమ్మల అరుదైన రికార్డు..

  • 21వ సారి జాతీయ పతాకావిష్కరణ
  • నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ప్రత్యేక ఘనత..

దమ్మపేట, ఆంధ్రప్రభ: తెలంగాణ వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానంలో మరో అరుదైన ఘట్టం చోటుచేసుకోనుంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో కొనసాగుతున్న ఆయన.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు 21 సార్లు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే గౌరవం దక్కించుకోనున్నారు.

పార్టీలు, ప్రభుత్వాలు మారినా ప్రజా ప్రతినిధిగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ వచ్చిన తుమ్మల నాగేశ్వరరావుకు ఈ ప్రత్యేక గుర్తింపు లభించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే 20 సార్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన.. ఈ ఏడాది ఆగస్టు 15న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21వసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు.

నాలుగు ప్రభుత్వాల్లో మంత్రిగా సేవలు

1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు.. అప్పటి ఎన్టీఆర్‌ ప్రభుత్వంలోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి రాజకీయాల్లో చురుకుగా కొనసాగుతూ ఎన్టీఆర్‌, చంద్రబాబు, కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు.

మైనర్‌ ఇరిగేషన్‌, రోడ్లు-భవనాలు, ప్రొహిబిషన్‌-ఎక్సైజ్‌, మేజర్‌-మైనర్‌ ఇరిగేషన్‌ వంటి కీలక శాఖలను నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది. ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ, సహకార, జౌళి శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.

ఐదుసార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి ఎమ్మెల్సీగా

తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ జీవితంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మంత్రిగా ఉన్న సమయంలో దాదాపు ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకావిష్కరణ చేసే అవకాశం దక్కింది. వేర్వేరు రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ మార్పుల మధ్య కూడా ఈ గౌరవం కొనసాగడం ఆయన సుదీర్ఘ ప్రజాజీవితానికి నిదర్శనంగా నిలుస్తోంది.

20 సార్లు జెండా ఆవిష్కరణ.. ఇప్పుడు 21వసారి

తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటివరకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సంవత్సరాలు:

1985, 1986, 1987, 1988, 1989, 1995, 1996, 1997, 1998, 1999, 2000, 2001, 2002, 2003
2015, 2016, 2017, 2018, 2024, 2025

ఈ ఏడాది ఆగస్టు 15న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జెండా ఆవిష్కరించడం ద్వారా ఈ సంఖ్య 21కి చేరనుంది.

రాజకీయ వర్గాల్లో ఆసక్తి

నలుగురు ముఖ్యమంత్రుల పాలనా కాలాల్లో ప్రభుత్వం తరఫున జాతీయ పతాకావిష్కరణ చేసే అవకాశం దక్కడం అరుదైన విషయమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. పార్టీల మార్పు, రాజకీయ పరిణామాల మధ్య కూడా తన ప్రస్థానాన్ని కొనసాగించిన తుమ్మల నాగేశ్వరరావు రికార్డు ప్రత్యేకంగా నిలుస్తోందని అభిప్రాయపడుతున్నారు.