Tenalai | ప్రశ్నిస్తే కొడతారా… తప్పుడు కేసులు పెడతారా – కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన జగన్

చంద్రబాబుపై కేసులున్నాయి
ఆయన్నీ కొడతారా
రెడ్ బుక్ రాజ్యాంగంలో పాలన అదుపు తప్పింది
తెనాలిలో వైసీపీ అధినేత జగన్

తెనాలి, ఆంధ్రప్రభ :
రెడ్ బుక్ రాజ్యాంగంలో రాష్ట్ర‌ పాలన అదుపు తప్పిందని, పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తెనాలిలోని నడివీధిలో ముగ్గురు యువకులను పోలీసులు చితకకొట్టిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు మంగళవారం ఆయన తెనాలికి వచ్చారు. ముగ్గురు యువకులు కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు అన్యాయాలు ఇలానే కొనసాగితే రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం జరుగుతుంని, వీరి మోసాలు, పరిపాలన మీద, అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేయడంపై నిరసనగా జూన్‌ 4న వెన్నుపోటు దినం కార్యక్రమాలు చేపట్టమని, ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

చంద్రబాబుపై కేసులుంటే .. కొడతారా?

ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మీద 24 కేసులున్నాయి.. అలా కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబును రోడ్డుపైకి తీసుకొచ్చి తన్నడం ధర్మమేనా? అలా చేయడం ధర్మం అవుతుందా? అని జగన్‌మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. మరి తెనాలి ఘటనలో పోలీసులు ఎందుకు అంత దారుణంగా వ్యవహరించారని నిలదీశారు. కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు పాలన, రెడ్‌ బుక్‌ రాజ్యాంగంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెనాలి ఘటన బాధితులు రాకేష్, విక్టర్, కరీముల్లాతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నత చదువులు చదువుకున్న వారే అని, పోలీసులు వారి కుటుంబాల పరువును అన్యాయంగా బజారుకీడ్చారని ధ్వజమెత్తారు.

ప్రశ్నించటమే తప్పా

సివిల్‌ డ్రెస్‌లో ఉన్న కానిస్టేబుల్‌ను ప్రశ్నించడం వీరు చేసిన తప్పా? అని ప్రశ్నించారు. ఏప్రిల్‌ 24న కానిస్టేబుల్‌ను యువకులు ప్రశ్నిస్తే.. 25న పోలీసులు మంగళగిరి వెళ్లి జాన్‌ విక్టర్‌ను, కరీముల్లాను కొట్టుకుంటూ తీసుకొచ్చారని, తర్వాత తెనాలి పోలీసు స్టేషన్‌లో కూడా పడేసి మరీ కొట్టారని, ఏప్రిల్‌ 26న తెనాలి ఐతానగర్‌ నడిరోడ్డు మీద పడేసి ముగ్గురి చితకబాదారని, ఇదెక్కడ న్యాయమని జగన్‌ ప్రశ్నించారు. 24 గంటల్లో కోర్టులో ఎందుకు హాజరు పరచలేదని నిలదీశారు. కోర్టుకు ప్రవేశపెట్టే ముందు వీరిని ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారని, ఆసుపత్రిలో వైద్యులు బాధితులకు ఉన్న గాయాలను ఎందుకు గుర్తించలేదని నిలదీశారు.

ప్రజా సంఘాలు నిరసన

తెనాలిలో వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి పర్యటనను వ్యతిరేకిస్తూ దళిత, ప్రజాసంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. తెనాలి మార్కెట్‌ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి ఆందోళన చేపట్టారు. వైసీపీ హయాంలో హత్యకు గురైన నూతక్కి కిరణ్‌ను జగన్‌ పరామర్శించలేదని… రౌడీషీటర్లకు మద్దతుగా నిలవడం దారుణమంటూ దళిత, ప్రజాసంఘాలు నినాదాలు చేశాయి. ఐతానగర్‌ సెంటర్‌లో జగన్‌ను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. జగన్‌ గో బ్యాక్‌ అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. తెనాలిలో ఎర్ర బడి వద్ద జగన్ కాన్వాయ్‌ను ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల నేతలు అడ్డుకున్నారు. దళితులపై ఇప్పుడు ప్రేమ పుట్టు కొచ్చిందా అంటూ నిరసన వ్యక్తం చేశారు. నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపారు. దళిత సంఘాల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు..

Leave a Reply