StockMarket | 1,000 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్

StockMarket | 1,000 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించిన ప్రకటనలు వెలువడటంతో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. దీనికి తోడు ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గడంతో దేశీయ సూచీలు దూసుకెళ్తున్నాయి.

ఉదయం ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 1,069 పాయింట్లు లాభపడి 76,597 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 327 పాయింట్లు ఎగబాకి 23,950 వద్ద కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 1,200 పాయింట్ల వరకు పెరగడం విశేషం. డాలర్‌తో పోలిస్తే రూపాయి కూడా బలపడింది. ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి విలువ 94.68 వద్ద నమోదైంది. మే 8 తర్వాత రూపాయి ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.

నిఫ్టీ సూచీలో శ్రీరామ్ ఫైనాన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, టీఎంపీవీ, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు ఓఎన్‌జీసీ, సిప్లా, భారతీ ఎయిర్‌టెల్, అపోలో హాస్పిటల్స్, సన్ ఫార్మా షేర్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ (డబ్ల్యూటీఐ) క్రూడ్ ధర బ్యారెల్‌కు నాలుగు శాతానికి పైగా పడిపోయి 80.91 డాలర్లకు చేరగా, బ్రెంట్ క్రూడ్ ధర 3.95 శాతం తగ్గి 83.88 డాలర్ల వద్ద కొనసాగుతోంది. చమురు ధరల పతనం, రూపాయి బలపడటం, ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణి కారణంగా మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.