గోప్యతతో నమ్మకం కల్పిస్తున్న టెలీ మానస్ కేంద్రాలు

గోప్యతతో నమ్మకం కల్పిస్తున్న టెలీ మానస్ కేంద్రాలు

అమరావతి, ఆంధ్రప్రభ: మానసిక రోగుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటుచేసిన టెలీ మానస్ కేంద్రాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళనతో ఉన్న వారు టెలీ మానస్ కేంద్రానికి హెల్ప్ లైన్ నెంబరు-14416 కు ఫోన్ చేసి వారి సమస్య చెబితే చక్కటి పరిష్కారంతో పాటు అవసరమైన వారికి మందులను కూడా సూచిస్తున్నారు. ఈ కేంద్ర సలహాలతో ఎంతో మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితులను విడనాడి సాధారణ జీవనం గడుపుతుండడం హర్షణీయం. ఈ కేంద్రాల పనితీరుపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు.

నెలకు 3 వేల మందికి స్వాంతన
కూటమి ప్రభుత్వం చేపడుతున్న పటిష్ట చర్యలతో ఈ కేంద్రాల ద్వారా నెలకు సుమారు 3 వేల మందికి పైగా మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు స్వాంతన పొందుతున్నారు. కేంద్ర సలహాలు, సూచనలతో వారి ఆత్మస్థెర్యం పెంపొందించి కొత్త జీవితం వైపు పయనిస్తున్నారు. మానసిక కుంగుబాటు, ఉద్వేగాల నుంచి బయటపడి ప్రశాంత జీవనం అలవరుచుకుని సంతోషంగా ఉంటున్నారు. 14416 ఉచిత హెల్ప్ లైన్ ద్వారా 24 గంటలూ సహాయం అందించేందుకు ఈ కేంద్రాల్లో ప్రత్యేకంగా కౌన్సెలర్లను నియమించారు.

పరీక్షల సమయంలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైన విద్యార్థులు ఈ సెంటర్లకు కాల్ చేసి వారి సమస్యలను వివరిస్తున్నారు. ఆందోళనతో ఉన్న విద్యార్థులకు కౌన్సెలర్లు ధైర్యం చెబుతూ వారి ఆలోచన విధానంలో మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖపట్టణం, కర్నూలు, గుంటూరు, నంద్యాల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి అత్యధికంగా హెల్ప్ లైన్ కు కాల్స్ రాగా, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి తక్కువగా వస్తున్నాయి.

విజయవాడ కేంద్రాలపై సమీక్ష
విజయవాడ బోధనాసుపత్రి, విశాఖ మానసిక చికిత్సాలయంలోని టెలీ మానస్ కేంద్రాల పనితీరుపై మంత్రి సత్యకుమార్ సమీక్షించారు. ఇప్పటివరకు 67,573 కాల్స్ అందినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా 40 మంది కౌన్సెలర్లు, టెక్నికల్ కో-ఆర్డినేటర్లు నియమించడం ద్వారా హెల్ప్ లైన్ మరింత బలోపేతం అయింది.

వివరాలు పూర్తిగా గోప్యం
మానసిక సమస్యలతో బాధపడేవారు ఫోన్ చేస్తే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతున్నామని అధికారులు తెలిపారు. మానసిక కుంగుబాటు (19.87%), ఉద్యోగ సమస్యలు, పరీక్షల భయం (19.20%), నిద్రలేమి (15.57%), ఇతర ఆందోళనలు (11.7%), మాదక ద్రవ్యాల అలవాటు (7.12%) వంటి సమస్యలతో ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. కౌన్సెలింగ్ తర్వాత ఆత్మహత్య ఆలోచనలు తగ్గుతున్నాయని తెలిపారు.

మాతృభాషలోనే సలహాలు
దేశవ్యాప్తంగా 53 టెలీ మానస్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. 14416 హెల్ప్ లైన్ ద్వారా కాల్ చేసిన వారికి మాతృభాషలోనే సలహాలు అందిస్తారు. నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే ప్రకారం ప్రతి వంద మందిలో 10.06 మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో టెలీ మానస్ కేంద్రాలు ప్రజలకు ఆశాకిరణంగా మారాయి.

Leave a Reply