పేదలకు తక్కువ ధరలో పౌష్టికాహారం

పేదలకు తక్కువ ధరలో పౌష్టికాహారం

హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలోని అన్నదాతలకు ప్రభుత్వం మరోసారి భరోసానిస్తూ.. మొక్కజొన్న, జొన్న పంటలకు మద్దతు ధర కల్పించి కొనుగోలు చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అంతేకాకుండా, సేకరించిన ఈ ఉత్పత్తులను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు రేషన్ దుకాణాల ద్వారా నేరుగా పేద ప్రజల చెంతకు చేర్చేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

రైతుల నుంచి కొనుగోలు చేసిన ఈ పంటలను బహిరంగ మార్కెట్లో వేలం వేసి మధ్యవర్తులకు లాభం చేకూర్చకుండా, ఆహార, పౌర సరఫరాల శాఖ ఆధీనంలోని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని వెల్లడించారు. రైతు ప్రయోజనమే పరమావధిగా ప్రజాప్రభుత్వం పని చేస్తోందని, పంట పండించిన రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతో మొక్కజొన్న, జొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించిందని స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశంలో రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ప్రజలకు ఈ పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు భట్టి విక్రమార్క చెప్పారు.

మధ్యవర్తుల దోపిడీకి చెక్.. పేదలకు మేలు

“సాధారణంగా ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో వేలం వేస్తుంది. దీన్ని అదునుగా తీసుకుని మధ్యవర్తులు తక్కువ ధరకే దక్కించుకుని లాభపడుతుంటారు. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ, సేకరించిన ధాన్యాన్ని ప్యాకింగ్ చేయించి నేరుగా ప్రజలకు తక్కువ ధరకు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

“ధాన్యం కేవలం మార్కెట్ సరుకుగా మిగిలిపోకూడదు.. అది పేదవాడి ఆకలి తీర్చి, పౌష్టికాహారంగా మారాలి” అని ఆయన అభిప్రాయపడ్డారు. గురుకులాలు, హాస్టళ్లకు పౌష్టికాహారం అందించేందుకు కూడా ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటను ప్రాసెసింగ్ చేసి పంపిణీ చేస్తామన్నారు.

ప్రభుత్వ నిర్ణయం వల్ల కేవలం సామాన్య ప్రజలకే కాకుండా, సంక్షేమ వసతి గృహాల్లో చదువుకునే వేలాది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారం అందించేలా మొక్కజొన్న, జొన్నల సరఫరాకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

అలాగే సంక్షోభంలో ఉన్న పౌల్ట్రీ రంగాన్ని ఆదుకునేందుకు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు పౌల్ట్రీ రైతులకు అవసరమైన మేరకు కూడా సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం పట్ల రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని భట్టి పేర్కొన్నారు.

Leave a Reply