Telangana Heat Wave | రాష్ట్రానికి రెడ్ అలర్ట్ హెచ్చరిక

Telangana Heat Wave | రాష్ట్రానికి రెడ్ అలర్ట్ హెచ్చరిక
Telangana Heat Wave | 47 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్‌లోనూ భానుడి భగభగలు
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల ఉగ్రరూపం
వడగాల్పులపై ప్రజలకు హెచ్చరికలు
కాలుష్యం, డీహైడ్రేషన్‌పై అప్రమత్తం
ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జిల్లాల వివరాలు
Telangana Heat Wave | హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ఎండలు ఉగ్రరూపం దాల్చి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఈ నెల 14 నుండి 21 వరకు తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌లో సైతం 42-44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మధ్యాహ్నం ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, డీహైడ్రేషన్‌కు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
గడచిన కొద్ది రోజులుగా కురిసిన అకాల వర్షాలతో స్వల్ప ఉపశమనం లభించినప్పటికీ.. ఇకపై భానుడి భగభగలు రెట్టింపు కానున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ప్రధానంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరనుందని సమాచారం. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్ దాటే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ జిల్లాలలోనే ఉగ్రరూపం..
ప్రధానంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కుమురం భీమ్ ఆసిఫాబాద్ వంటి జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నివేదిక హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలను రెడ్ మార్క్ జిల్లాల జాబితాలో చేర్చారు. ఈ ప్రాంతాల్లో మే 14 నుండి వడగాల్పుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని అలర్ట్‌లో పేర్కొన్నారు.
హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉండగా, ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకపోవడమే శ్రేయస్కరం అని వాతావరణ నిపుణులు పిలుపునిచ్చారు.
గత నాలుగైదు రోజుల నుంచి ద్రోణి దగ్గరగా ఉండటం, సముద్రం నుంచి తేమ గాలులు రావడం, ఉరుములు మెరుపులు రావడం వల్ల చిన్న చిన్న జల్లులు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని వల్ల విండ్ డైరెక్షన్‌లో తేడా ఉండటంతో గత 5 నుంచి 6 రోజులు మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తగ్గిందని, కాగా ప్రస్తుతం ఈ పరిస్థితి బలహీనపడిందని తెలిపారు.
సోమవారం నుంచి యథావిధిగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో 42.6 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 41.5 డిగ్రీలు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లో 36 నుంచి 40 వరకు ఉష్ణోగ్రత రికార్డు అయ్యాయని తెలిపారు.
ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, కుమురం భీమ్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ ఉష్ణోగ్రత 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉండగా, తెలంగాణ రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ఉంటుంది. ఆయా ప్రాంతాలలో 36 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
