35 ఏళ్ల విశిష్ట పోలీస్ సేవలకు ఇండియన్ పోలీస్ మెడల్

కర్నూలు రేంజ్ డీఐజీ-2 ఉదయభాస్కర్‌కు ప్రతిష్ఠాత్మక గౌరవం

పెడన, ఆంధ్రప్రభ: కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని గూడూరు గ్రామానికి చెందిన డి. ఉదయభాస్కర్‌కు ప్రతిష్ఠాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ లభించింది. ప్రస్తుతం కర్నూలు రేంజ్ డీఐజీ-2, ఏపీఎస్పీ బెటాలియన్స్‌గా సేవలందిస్తున్న ఆయనకు సుమారు 35 ఏళ్లపాటు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధతతో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ జాతీయ స్థాయి గౌరవం దక్కింది. 2026 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అమరావతి-గుంటూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆయన ఈ పతకాన్ని అందుకోనున్నారు.

ఉదయభాస్కర్ 1991లో ఆర్ఎస్ఐగా పోలీస్ శాఖలో సేవా ప్రస్థానం ప్రారంభించి వివిధ హోదాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఉన్నత స్థాయికి ఎదిగారు. శాంతిభద్రతల పరిరక్షణ, పోలీస్ సిబ్బంది సంక్షేమం, శిక్షణ, పరిపాలన, బెటాలియన్ నిర్వహణలో విశేష సేవలందించారు. విధి నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ సిబ్బందికి మార్గదర్శకత్వం అందించడంతోపాటు సంస్థాగత క్రమశిక్షణను పెంపొందించడంలో నాయకత్వ ప్రతిభను ప్రదర్శించారు. ఇప్పటికే పలు పోలీస్ సేవా పతకాలు, పురస్కారాలు, ప్రశంసలు అందుకున్న ఆయనకు తాజాగా ఇండియన్ పోలీస్ మెడల్ లభించడంపై కృష్ణా జిల్లా పోలీస్ అధికారులు, ఏపీఎస్పీ అధికారులు, సిబ్బంది, పలువురు ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.