కరీంనగర్లో విస్తృత నాకాబందీ.. 82 వాహనాలు సీజ్
రూ.25,700 జరిమానా.. 78 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
కరీంనగర్ క్రైం, ఆంధ్రప్రభ: నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల అమలులో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం రాత్రి 11 గంటలకు విస్తృత నాకాబందీ నిర్వహించారు. టౌన్, రూరల్, హుజురాబాద్ డివిజన్లలోని ప్రధాన కూడళ్లు, రహదారులపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 128 స్పాట్ చలాన్లు విధించి రూ.25,700 జరిమానా వసూలు చేశారు. 78 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి 82 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 8 నాలుగు చక్రాల వాహనాలు, 45 ద్విచక్ర వాహనాలు, 6 ఇతర వాహనాలు ఉన్నాయి. అదనంగా 4 ఈ-పెట్టి కేసులు నమోదు చేశారు.
పెండింగ్ చలాన్లపైనా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. మొత్తం రూ.87,000 విలువైన పెండింగ్ చలాన్లను గుర్తించారు. టౌన్ డివిజన్లో 45 స్పాట్ చలాన్లకు రూ.9,900 జరిమానా విధించి 21 వాహనాలు, రూరల్ డివిజన్లో 31 స్పాట్ చలాన్లకు రూ.8,000 జరిమానా విధించి 23 వాహనాలు, హుజురాబాద్ డివిజన్లో 52 స్పాట్ చలాన్లకు రూ.7,800 జరిమానా విధించి 38 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు భద్రత, నేరాల నియంత్రణ కోసం ఇలాంటి నాకాబందీలు, వాహన తనిఖీలు కొనసాగుతాయని పోలీసు అధికారులు తెలిపారు.
