కరెంట్ తీగలే.. కబళించాయి
మార్వాడీపల్లిలో విషాదం.. పొలానికి వెళ్లి విగతజీవులైన తండ్రీకొడుకులు
వ్యవసాయ మోటార్ రిపేర్ చేస్తుండగా విద్యుదాఘాతం.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన
మల్హర్, ఆంధ్రప్రభ: పొలానికి వెళ్లిన తండ్రి, కొడుకు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారని ఆ కుటుంబం ఎదురుచూసింది. కానీ విధి వారిని తిరిగి రానివ్వలేదు. వ్యవసాయ మోటార్ రిపేర్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై తండ్రీకొడుకులు మృత్యువాత పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామపంచాయతీ పరిధిలోని మార్వాడీపల్లికి చెందిన కట్టెకోళ్ల బాపు (48)కు మల్హర్ మండలం కొండంపేట శివారులో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గురువారం సాయంత్రం బాపు తన కుమారుడు మనోజ్ (22)తో కలిసి పొలానికి వెళ్లి వ్యవసాయ మోటార్‌ను రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. తీవ్ర విద్యుదాఘాతంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. రాత్రయినా తండ్రీకొడుకులు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం ఉదయం బాపు భార్య రజిత పొలం వద్దకు వెళ్లి చూడగా ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు.
కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న బాపుతో పాటు కుమారుడు మనోజ్ కూడా ఒకేసారి మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ విషాద వార్త తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు మృతి చెందడంతో మార్వాడీపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహాదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొయ్యూరు ఎస్సై మహేందర్‌కుమార్ తెలిపారు.
