Temple Tender Scam | కోట్ల రూపాయల ఆదాయానికి గండి

Temple Tender Scam | కోట్ల రూపాయల ఆదాయానికి గండి

Temple Tender Scam | టెండర్లలో గోల్మాల్‌పై విమర్శలు
మంత్రి ఆదేశాలకూ బేఖాతరు
యాదాద్రిలో దుకాణదారుల ఆధిపత్యం
బహిరంగ టెండర్లకు తిలోదకాలు
స్థానిక నిరుద్యోగులకు అవకాశాల కరువు

Temple Tender Scam | హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ఆలయాల్లో వర్తకుల గుత్తాధిపత్యం నడుస్తోంది. వర్తకులకు ఆలయ అధికారులు సహకరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయాల్లో వివిధ సేవలకు బహిరంగ టెండర్లు వేయాల్సి ఉంటుంది. కానీ, ఆ నిబంధనలకు అధికారులే తిలోదకాలు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆలయాలకు కోట్ల రూపాయల నష్టం జరుగుతోంది.

శాఖ మంత్రి సైతం ఓ ఆలయంపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కోరినా.. ఇవ్వలేదనే ప్రచారం జరుగుతోంది. అంటే అధికారులు ఏ మేరకు నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారనేది స్పష్టమవుతుంది. రాష్ట్రంలో 704 ప్రధాన ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల పరిధిలో మండిగలు (దుకాణ సముదాయాలు) ఉంటాయి. వీటిని టెండర్ల రూపంలో, బహిరంగ వేలంపాట ద్వారా వేలం వేసి ఎవరు ఎక్కువగా పాడితే వారికి ఇస్తారు. అయితే వీటితో ఆలయాలకు ఆదాయం వస్తుంది.

అయితే ఏ ఆలయం పరిధిలోని దుకాణాలైనా టెండర్ గడువు మరో 3 నెలల్లో ముగుస్తుందనే సమాచారంతో టెండర్ నోటిఫికేషన్ వేయాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలతో పాటు 6(ఏ) పరిధిలోని ఆలయాల్లో సైతం వేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి కారణం దేవస్థానాలకు చెందిన కొంతమంది అధికారులు టెండర్ దారులతో కుమ్మక్కు కావడమేననే విమర్శలు వస్తున్నాయి.

టెంకాయలు, సెల్‌ఫోన్స్‌, భక్తులు సమర్పించే మొక్కుల వస్త్రాలు, ఇలా పలు టెండర్లకు నోటిఫికేషన్ వేయడం లేదనే ప్రచారం జరుగుతోంది. కొన్ని ఆలయాల్లో గడువు ముగుస్తున్నప్పటికీ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆలయాలకు రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయానికి ఉద్యోగులే గండి కొడుతున్నట్లు స్పష్టమవుతోంది.

టెండర్లలో గోల్మాల్

ఓ ఆలయానికి భక్తులు సమర్పించే మొక్కు వస్త్రాలు సేకరించే కాలపరిమితి పొడిగించేందుకు టెండర్ దారుడి దరఖాస్తుపై టెండర్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని మంత్రి కొండా సురేఖకు ఫిర్యాదు అందగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. అధికారులు మాత్రం అందుకు సంబంధించిన నివేదిక కూడా ఇవ్వలేదనే ప్రచారం జరుగుతోంది.

ఆలయాలకు వచ్చే ఆదాయం రాకుండా టెండర్ దారులపై ఆలయ ఉద్యోగులు కుమ్మక్కవుతున్న దానిపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని, ఆలయ అధికారులపై సైతం పర్యవేక్షణ చేయాలని, టెండర్లలో అక్రమాలకు చెక్ పెట్టాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే పలు ఆలయాలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్లు సమాచారం.

యాదాద్రిలో చక్రం తిప్పుతున్న దుకాణదారులు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొందరు దుకాణదారులు చక్రం తిప్పుతున్నారని సమాచారం. ఓపెన్ టెండర్లు వేయకుండా నామమాత్రపు అద్దెలతో కొందరికే లబ్ధి చేకూరుస్తుండగా, దేవాదాయశాఖ ఆదాయానికి గండి పడుతున్నదని తెలుస్తోంది.వర్తక సంఘం ఆధిపత్యం, మరోవైపు వారికి అధికారులు సహకరిస్తుండటంతోనే ఆలయానికి తీవ్రంగా నష్టం వాటిల్లుతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి.

కొండపై ఉన్న సెల్‌ఫోన్ కౌంటర్ టెండర్ ద్వారా దేవస్థానానికి ఏడాదికి రూ.2 కోట్ల 22 లక్షల ఆదాయం సమకూరుతోంది. కానీ, వర్తక సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న 10 కీలక దుకాణాలకు సంబంధించి దేవస్థానానికి చెల్లిస్తున్నది కేవలం రూ.1 కోటి 68 లక్షలు మాత్రమే. దీంతో ఒక చిన్న కౌంటర్ నుంచి వచ్చే ఆదాయం కంటే 10 పెద్ద దుకాణాలు ఇచ్చే ఆదాయం తక్కువగా ఉండడం వెనుక ఉన్న మర్మమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే కొండపై ఉన్న 112 తాత్కాలిక దుకాణాల్లో ప్రస్తుతం 10 దుకాణాలు వర్తక సంఘం పేరిటే కొనసాగుతున్నట్లు సమాచారం. వీటికి మే 31 నాటికి గడువు ముగుస్తున్నప్పటికీ ఇప్పటివరకు టెండర్ నోటిఫికేషన్ వేయలేదని సమాచారం. ఈ దుకాణాలు ఎప్పుడూ ఒకే వర్గం లేదా కొందరి చేతుల్లోనే ఉండడం వల్ల కొత్త వారికి, స్థానిక నిరుద్యోగులకు అవకాశాలు దక్కడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

ఏటా కొత్త టెండర్లు పిలిచి అందరికీ అవకాశం కల్పిస్తే దేవస్థానానికి రూ.20 నుంచి రూ.25 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, దేవాదాయశాఖ అధికారులు మాత్రం టెండర్ నోటిఫికేషన్ గడువు ముగుస్తుందని ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశామని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం ముందుకెళ్తామని చెబుతున్నారు.

Leave a Reply