13thMayeditorial | విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం

13thMayeditorial | విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం
13thMayeditorial | విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం
ఎన్‌టీఏ వైఫల్యంపై విమర్శలు
సీబీఐ దర్యాప్తుపై అనుమానాలు
లక్షలాది విద్యార్థుల ఆవేదన
అవినీతి, లీకేజీలపై ఆందోళన
ప్రభుత్వం ఆత్మపరిశీలన అవసరం
13thMayeditorial | జాతీయ అర్హత పరీక్ష (నీట్) యూజీ ప్రశ్నపత్రం రాజస్థాన్‌లో లీక్ అయినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈనెల 3వ తేదీన జరిగిన ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్టు జాతీయ పరీక్షా సంస్థ (ఎన్‌టీఏ) ప్రకటించింది. ఇలా నీట్ పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ కావడం వల్ల విద్యా సంవత్సరం పోగొట్టుకుంటున్న విద్యార్థుల భవిష్యత్‌పై సుప్రీంకోర్టు గతంలో కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఇది విద్యార్థుల జీవితాలతో చెలగాటమే. అయినా రీటెస్ట్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన చేయడం విద్యార్థుల జీవితాలతో చెలగాటమే. ఏ తప్పూ చేయని లక్షలాది విద్యార్థులకు ఈ శిక్ష దేనికి?
నీట్ పరీక్షాపత్రం లీక్‌పై దేశవ్యాప్తంగా గతంలో కూడా ఆందోళన వ్యక్తమైంది. రీటెస్ట్ జరిపిస్తామని జాతీయ పరీక్షా సంస్థ ప్రకటించడం మన వ్యవస్థలో ఉన్న లోపాన్ని తెలియజేస్తోంది. పెద్ద యంత్రాంగం, వ్యవస్థ కలిగిన జాతీయ పరీక్షా సంస్థ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి నీట్ రీటెస్ట్ అవకాశం ఇవ్వడం సిగ్గుచేటు. ఈ పరీక్షలకు విద్యార్థులు రాత్రిపగలు చదువుపై దృష్టిని కేంద్రీకరించి హాజరయ్యారు. కొత్త పరీక్ష కోసం మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదనీ, ఫీజు చెల్లించనవసరం లేదని ఆ సంస్థ ప్రకటించింది.
ప్రశ్నపత్రం లీకేజీపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించింది. సీబీఐ దర్యాప్తుపై ఎంత విశ్వాసం ఉందో ఇతర కేసుల్లో దాని నిజాయితీని బట్టి వెల్లడి అవుతోంది. సుప్రీంకోర్టు గతంలోనే సీబీఐ నిజాయితీపై అనుమానం వ్యక్తం చేసింది. సీబీఐ పంజరంలో పక్షిలా పని చేస్తోందని వ్యాఖ్యానించింది. ఈ పరీక్షకు చెందిన ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలు వాట్సాప్ ద్వారా రాజస్థాన్ నుంచి కేరళకు క్షణాల్లో చేరిపోయాయి. వాట్సాప్ వంటి అధునాతన సౌకర్యాలు అనుచిత కార్యకలాపాలకు ఉపయోగపడటం దురదృష్టకరం.

ప్రాక్టీస్ పేపర్లు 20 వేల నుంచి రెండు లక్షల వరకూ విక్రయించారంటే ఇది ఎంత పెద్ద ఎత్తున వ్యాపారంగా నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి దీనితో ప్రమేయం ఉన్న వారంతా దోషులే. వీరిలో అధ్యాపకులు కూడా ఉండి ఉండవచ్చు. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యకలాపాలు జరుగుతున్నాయంటే, ప్రభుత్వాధికారుల దృష్టికి రాకుండా ఉండి ఉండదు. ప్రతి స్థాయిలో అవినీతి కారణంగానే ఇలాంటి కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయి.
ఇందుకు సంబంధించి కొందరు అనుమానితులను అరెస్టు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అనుమానితులను అరెస్టు చేసినంత మాత్రాన విద్యార్థులు నష్టపోయిన విద్యా సంవత్సరం మళ్లీ వస్తుందా? ఇవన్నీ కంటితుడుపు చర్యలు. అలాగే, లక్షలాది రూపాయిలు ఖర్చుచేసి తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రుల మనోవేదన కూడా మాటలతో, డబ్బుతో తీర్చలేనిది. తాము చేయని తప్పుకు తమకు శిక్ష విధించినట్టుగా ఉందని కొందరు విద్యార్థులు వాపోతున్నారు. ఈ పరీక్ష వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయని వారంటున్న మాటలు అసత్యం కాదు.
నీట్ యూజీ-2026కు దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహిస్తామంటే ఎంత హాస్యాస్పదం? ఇది ప్రభుత్వానికి ఎంత అప్రతిష్ట. నీట్ పరీక్ష విషయంలో ఎందుకు ఈ పొరపాట్లు జరుగుతున్నాయో ప్రభుత్వం ఆత్మపరిశీలన జరుపుకుని తప్పులు దిద్దుకోవాలి.
