Telangana Cooperative Societies | సహకార సంఘాల భర్తీపై ప్రభుత్వ కీలక నిర్ణయం

Telangana Cooperative Societies | సహకార సంఘాల భర్తీపై ప్రభుత్వ కీలక నిర్ణయం
Telangana Cooperative Societies | నామినేటెడ్ విధానంలో పాలకవర్గాల ఏర్పాటు
రెండు విడతల్లో కొత్త కమిటీల నియామకం
రైతులకు మెరుగైన సేవలే ప్రభుత్వ లక్ష్యం
కొత్త సంఘాలతో గ్రామీణ రైతులకు ఊరట
Telangana Cooperative Societies | హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : నామినేటెడ్ పదవుల భర్తీ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కార్పొరేషన్ల జాబితాను రెడీ చేసిన సర్కార్, ముందుగా ఈ నెల 23 తర్వాత సహకార సంఘాలకు కొత్త పాలకవర్గాల ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో ఇప్పటి వరకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికల విధానం ఉండగా, ఇక నుంచి నామినేటెడ్ పద్ధతిలో పోస్టులను పరోక్షంగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి వరకు పర్సన్ ఇన్‌చార్జీలతో పాలన సాగగా.. కొత్త కమిటీల ఏర్పాటు వరకు పాతవారే బాధ్యతలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు చెందిన వారే మళ్లీ బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. సొసైటీల్లో ప్రతిపక్ష నేతలు చార్జ్ తీసుకోవడంతో హస్తం నేతల్లో అసంతృప్తి వ్యక్తమైంది. వెంటనే పాలకవర్గాలను భర్తీ చేయాలని వారు కోరడంతో ప్రభుత్వం ప్రక్రియను వేగవంతం చేసింది.
కేబినెట్ నిర్ణయం..
గత నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సహకార సంఘాల భర్తీపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, అర్హులైన వారి జాబితాలను ఈ నెలాఖరులోగా అందించాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా 906 సంఘాలు ఉండగా, 11,778 మంది అధికార పార్టీ నేతలకు పదవులు దక్కనున్నాయి. పాలకవర్గాన్ని నియమించేలా ప్రభుత్వం రెడీ అవుతోంది. ఏపీలో అమలులో ఉన్న విధానాన్నే ఇక్కడ పరిగణనలోకి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
పాలకవర్గంలో ఒక ఎస్సీ మహిళ, ఒక ఎస్టీ మహిళ, ఇద్దరు బీసీ జనరల్, ఒక ఓసీ మహిళ, మరో ఏడుగురు జనరల్ సభ్యులు ఉంటారు. పదవుల్లో నియమితులయ్యే వారు ఆయా సంఘాల్లో సభ్యులై ఉండాలి. గతంలో రుణాలు తీసుకుని ఎగవేసిన వారు అర్హులు కాదు. ప్రభుత్వ ఉద్యోగులు, పంచాయతీరాజ్ సంఘాల్లో ఇప్పటికే ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అవకాశం లేదు.
రెండు విడతల్లో భర్తీ…
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాలను రెండు దశల్లో భర్తీ చేయనున్నట్లు తెలిసింది. ముందుగా పాత సంఘాలకు పాలకవర్గాలను ఏర్పాటు చేసి, రెండో విడతలో కొత్త వాటికి నియమించనున్నారు. కొత్త మండలాల్లో 131 నూతన సంఘాలు ఏర్పాటు చేయాలని సహకార శాఖ రెండు నెలల క్రితం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. జిల్లా నుంచి పంపిన ఈ ప్రతిపాదనలకు సర్కారు ఆమోదముద్ర వేస్తే దశలవారీగా ఇవి ఏర్పాటు కానున్నాయి.
గతంలో ఏర్పాటు చేసిన సంఘాల విస్తరణలో ఒక్కో పీఏసీఎస్ చైర్మన్‌తోపాటు 12 మంది సభ్యుల తీవ్ర అసమానతలు నెలకొన్నాయి. కొన్ని చోట్ల రెండు గ్రామాలకు ఒక సంఘం ఉంటే, మరికొన్ని చోట్ల 30 గ్రామాలకు కలిపి ఒకటే సంఘం ఉంది. సభ్యత్వ పరంగా ఒక సంఘంలో 500 మంది ఉంటే, మరికొన్నింటిలో 2,500 మంది రైతులు ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 81 మండలాల్లో ఒక్క సహకార సంఘం లేదు.
ఈ వ్యత్యాసాలను గమనించిన ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి 31 జిల్లాల నుంచి వచ్చిన 215 ప్రతిపాదనలను పరిశీలించి, 131 మండలాలకు సహకార శాఖ జాబితా సిద్ధం చేసింది. కొత్త సంఘాలు ఏర్పాటు చేస్తే రైతులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే పంట రుణాలు పొందే అవకాశం ఉంది.
కొత్త పాలకవర్గాలు వస్తే మెరుగైన సేవలు
రాష్ట్రంలో ఇప్పటి వరకు పీఏసీఎస్ కేంద్రాలకు పర్సన్ ఇన్‌చార్జీలు ఉండడంతో రైతులకు అరకొరగా సేవలు అందాయి. అధికార పార్టీ నేతలు ఎన్నికల విధానానికి స్వస్తి పలికి నామినేటెడ్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కొత్త పాలకవర్గం కొలువుదీరితే రైతులకు సకాలంలో వ్యవసాయ రుణాలు ఇవ్వడంతోపాటు ఎరువుల విక్రయాలు, ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతాయి.
వ్యవసాయ యాంత్రీకరణ, పశుపోషణ, బంగారంపై రుణాలు అందుతాయి. పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఎరువుల విక్రయాలు సాగుతున్నాయి. పీఏసీఎస్ కేంద్రాలు ఏటా 5 వేల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా నిర్వహిస్తున్నాయి. రాయితీపై వరి, కంది, పెసర, మినుము, జనుము, జీలుగ విత్తనాలను కూడా విక్రయిస్తున్నాయి. త్వరగా భర్తీ చేసేందుకు సహకార శాఖ ఇప్పటికే నామినేటెడ్ విధానానికి సంబంధించిన నివేదికను అందజేసింది.
