గవర్నర్ ప్రవర్తన రాజ్యాంగబద్ధం కాదు. -మాజీమంత్రి తలసాని
గవర్నర్ ప్రవర్తన రాజ్యాంగబద్ధం కాదు. -మాజీమంత్రి తలసాని
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తమిళనాడులో టీవీకే అధినేత విజయ్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టువంటిదని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించినట్లు ఆయన కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. సీనియర్ రాజకీయ నాయకుడిగా, ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిగా తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తాను తీవ్ర ఆవేదనకు గురవుతున్నానని తలసాని ఆ ప్రకటనలో తెలిపారు.
దేశవ్యాప్తంగా ఇప్పటికే గవర్నర్ వ్యవస్థపై వ్యతిరేకత పెరుగుతోందని, గవర్నర్ పాత్ర రాజ్యాంగ పరిధిలోనే ఉండాలని ఆయన అభిప్రాయపడినట్లు ప్రకటనలో వెల్లడించారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ పార్టీ నిలిచిందని ప్రాంతీయ, జాతీయ మీడియాతో పాటు ఎన్నికల కమిషన్ కూడా స్పష్టం చేసిందని తలసాని పేర్కొన్నట్లు తెలిపారు.
అత్యధిక స్థానాలు సాధించిన పార్టీ నాయకుడు గవర్నర్‌ను కలిసినప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉంటుందని, ఆ తర్వాత అసెంబ్లీలో బలపరీక్ష ద్వారా మెజారిటీ నిరూపించుకోవడం సంబంధిత నాయకుడి బాధ్యతేనని ఆయన అభిప్రాయపడినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అయితే తమిళనాడు గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని తలసాని విమర్శించినట్లు వెల్లడించారు.
రాజ్యాంగాన్ని, చట్టాలను తుంగలో తొక్కే విధంగా కొందరు గవర్నర్లు వ్యవహరించడం వల్లే దేశవ్యాప్తంగా గవర్నర్ల వ్యవస్థపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని కూడా తలసాని పేర్కొన్నట్లు పత్రికా ప్రకటనలో ఉంది.
108 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని ముందుకొచ్చిన విజయ్‌ను గవర్నర్ చుట్టూ తిప్పుకుంటూ అవమానిస్తున్నారని, ప్రజాస్వామ్యబద్ధంగా అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీని, నాయకుడిని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించినట్లు పేర్కొన్నారు.
ప్రజా తీర్పును అవమానించే విధంగా ఈ పరిణామాలు ఉన్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగిలిపోతుందని తలసాని వ్యాఖ్యానించినట్లు ఆయన కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికైనా గవర్నర్ల వ్యవస్థపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన సూచించినట్లు తెలిపారు.
