పీజీఆర్ఎస్‌పై ప్రజల స్పందనకు ప్రత్యేక క్యూఆర్ కోడ్

  • ఆగస్టు 10న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ
  • కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో అందుబాటులో అధికారులు
  • అర్జీదారులు సేవలు పొందిన వెంటనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చ
  • జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ

విజయవాడ, ఆంధ్రప్రభ: ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో భాగంగా సోమవారం, ఆగస్టు 10న ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. విజయవాడ కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో వినతుల స్వీకరణ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను అధికారులకు సమర్పించి, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా పీజీఆర్ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లోనూ సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వినతులు స్వీకరిస్తారని కలెక్టర్ తెలిపారు. ప్రజలు తమ ప్రాంతానికి సమీపంలోని పీజీఆర్ఎస్ కేంద్రానికి వెళ్లి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు.

సేవలపై స్పందనకు ప్రత్యేక క్యూఆర్ కోడ్

పీజీఆర్ఎస్‌ను మరింత పారదర్శకంగా, ప్రజా స్నేహపూర్వకంగా నిర్వహించేందుకు అర్జీదారుల స్పందన కోసం ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని కలెక్టర్ తెలిపారు. పీజీఆర్ఎస్ సేవలు పొందిన అనంతరం మొబైల్ ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి సేవలపై తమ అభిప్రాయాలు, సూచనలు, స్పందనను తెలియజేయవచ్చని వివరించారు.

ఆన్‌లైన్‌లోనూ అర్జీల నమోదు

కార్యాలయాలకు నేరుగా వచ్చి వినతులు సమర్పించడంతో పాటు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ సమస్యలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన అర్జీల స్థితిగతులు, పరిష్కార ప్రక్రియకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చని తెలిపారు. ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడమే పీజీఆర్ఎస్ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.