కుప్పంలో మూడు రోజుల పాటు సీఎం చంద్రబాబు పర్యటన..
- పారిశ్రామికాభివృద్ధి, మౌలిక వసతులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 3 నుంచి 5 వరకు మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక వసతులు, వైద్య సేవలు, వ్యవసాయం, ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ కార్యక్రమాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమం ఖరారైంది.
జూలై 3న మధ్యాహ్నం 3 గంటలకు గుడుపల్లె మండలంలోని ద్రావిడ విశ్వవిద్యాలయం హెలిప్యాడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో సమావేశమవుతారు. అనంతరం పొగురుపల్లెలో ఏబీఐఎస్ ప్రోటీన్స్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్, 44.58 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఏపీఐఐసీ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కును ప్రారంభిస్తారు. సుమారు 200 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తారు.
అలాగే రూ. 3,847.12 కోట్ల పెట్టుబడితో 12 కొత్త పరిశ్రమలు, మూడు విద్యుత్ ఉపకేంద్రాలు, ఇస్కాన్ ఆలయం, గ్రానైట్ హెరిటేజ్ స్టోన్ క్లస్టర్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సౌర విద్యుత్ ప్రాజెక్టులు, 5,179 గృహాల ప్రారంభం, రూ. 1,026.69 కోట్ల పెట్టుబడులతో ఆరు పరిశ్రమలకు అవగాహన ఒప్పందాల మార్పిడి కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగించి, అనంతరం స్వర్ణ కుప్పం ప్రదర్శనను సందర్శించి పారిశ్రామికవేత్తలతో సమీక్ష నిర్వహిస్తారు.
జూలై 4న సెట్టిపల్లిలో నెట్ జీరో నమూనా గృహాలను పరిశీలించిన తర్వాత స్వర్ణ కుప్పం ప్రవేశ ద్వారాన్ని ప్రారంభిస్తారు. కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో సీటీ స్కాన్ కేంద్రం, డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించి ఆరోగ్య శాఖ ప్రదర్శనను సందర్శిస్తారు. అనంతరం కాడా అతిథి గృహాన్ని ప్రారంభించి, పార్టీ కార్యాలయంలో జననాయకుడు ఫిర్యాదుల వ్యవస్థను పరిశీలిస్తారు.
ఎల్పీజీ శ్మశానవాటికను ప్రారంభించిన అనంతరం కుప్పం నమూనా బస్సు స్టేషన్, డిపోకు శంకుస్థాపన చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కంగుండి గ్రామంలో 320 భూమిలేని కుటుంబాలకు అసైన్మెంట్ పట్టాలు పంపిణీ చేయడంతో పాటు 61 ఏళ్ల భూ సమస్య పరిష్కారానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం స్వర్ణ కుప్పం విజన్–2029 మాస్టర్ ప్లాన్‌పై సమీక్ష, పార్టీ సమన్వయ సమావేశాలు నిర్వహిస్తారు.
జూలై 5న ముఖ్యమంత్రి నివాసంలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశమై నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై చర్చిస్తారు. పీ4 పథకం ప్రదర్శనను సందర్శించి, అనంతరం పర్యావరణ అనుకూల కోళ్ల ఫారాన్ని పరిశీలించి రైతులు, మత్స్యకారులు, ప్రాథమిక రంగ ప్రతినిధులతో సమావేశమవుతారు.
ఐటీసీ–వీసీవీ ఫౌండేషన్ మధ్య కుప్పం చిరుధాన్యాల పునరుద్ధరణ ప్రాజెక్టుకు సంబంధించిన అవగాహన ఒప్పందాల మార్పిడికి సాక్ష్యమవుతారు. చివరగా ద్రావిడ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశమై పరిపాలన, ప్రజాభిప్రాయంపై చర్చించిన అనంతరం సాయంత్రం కుప్పం పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమవుతారు.
