ఎండలోనే చిరు వ్యాపారాలు

ఎండలోనే చిరు వ్యాపారాలు
- సౌకర్యాలు కల్పించని మున్సిపాలిటీ
- అనారోగ్యం పాలవుతున్న వ్యాపారులు
భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ ; ట్రాఫిక్ అంతరాయం పేరిట మార్కెట్ ను తరలించిన అధికారులు చిరు వ్యాపారులకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలం అయ్యారు. సుమారు రెండు నెలల క్రితం సుమంగళి చౌరస్తా వద్ద ఉన్న కూరగాయల మార్కెట్ ను ట్రాఫిక్ ఇబ్బందుల పేరిట ఓల్డ్ తహసీల్దార్ కార్యాలయం ఓపెన్ ప్లేస్ కు తరలించారు. సుమంగళి చౌరస్తా వద్ద వ్యాపారం చేసుకుంటున్న కొందరు కూరగాయల వ్యాపారులు సౌకర్యాలు లేని ఓపెన్ ప్లేస్ కు వెళ్లేందుకు ససేమిరా ఒప్పుకోలేదు.
అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు, నాయకులు హామీ లు గుప్పించి ఎట్టకేలకు మార్కెట్ ను ఓల్డ్ తహసీల్దార్ ఓపెన్ ప్లేస్ కు తరలించారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై మధ్యలో నిలిచిన సమీక్రుత మార్కెట్ గద్దులను పూర్తి చేయించి అందుబాటులో కి తెస్తామని మరి కొందరు ప్రగల్బాలు పలికారు. వీరి మాటలు నమ్ముకున్న కూరగాయల వ్యాపారులు తమ వ్యాపారాలను ఓపెన్ ప్లేస్ కు షిఫ్ట్ చేసుకున్నారు. వీరి చర్య ద్వారా సుమంగళి చౌరస్తా వద్ద ట్రాఫిక్ అంతరాయం సమస్య తీరింది.
కాని నాయకులు, అధికారులు కూరగాయల వ్యాపారులకు ఇచ్చిన హామీలను మరిచిపోయారు. దాంతో మండు టెండలో కూరగాయల వ్యాపారులు నడుపుకుంటున్నారు. కనీస సౌకర్యాలు లేక పోవడం తో వ్యాపారులు నరకయాతన అనుభవిస్తున్నారు. వ్యాపారులకు తాగు నీరు సౌకర్యం, షెడ్డుల ఏర్పాటు, మటన్, ఫిష్ మార్కెట్ లకు ప్రత్యేకంగా స్థలాల కేటాయింపు లేక పోవడం వ్యాపారులను ఇబ్బంది చేస్తోంది.
ఫిష్ మార్కెట్ ఐతే రొడ్డు పైనే నడిపిస్తున్నారు. కొనుగోలు చేసేందుకు వచ్చే వారు తమ వాహనాలను రోడ్డుపైనే నిలుపుతున్నారు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ఇక సోమవారం నిర్వహించే సంత సైతం అడ్డగోలుగా దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా ట్రాఫిక్ సమస్య సోమవారం మరింత తీవ్రం అవుతుంది. అధికారులు, నాయకులు జోక్యం చేసుకుని ఎండ భారీ నుండి వ్యాపారులకు రక్షణ కల్పించాలని చిరు వ్యాపారులు కోరుతున్నారు.
