ఇంద్రకీలాద్రిపై పెరుగుతున్న భక్తుల రద్దీ

ఇంద్రకీలాద్రిపై పెరుగుతున్న భక్తుల రద్దీ

రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టిన దేవస్థానం

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ పవిత్ర ఇంద్రకీలాద్రి క్షేత్రంలో వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అప్రమత్తమైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం సులభతరంగా, ప్రశాంతంగా జరిగేలా దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించారు.

దుర్గాఘాట్, ఘాట్‌రోడ్, కనకదుర్గానగర్ ప్రాంతాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఈవో క్షుణ్ణంగా పరిశీలించారు. క్యూ లైన్ల నిర్వహణ, రద్దీ నియంత్రణ చర్యలు, భక్తుల రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్లోక్‌రూమ్‌లు, చెప్పుల స్టాండ్లు, తాగునీటి వసతులు తదితర సేవలను పరిశీలించిన ఆయన, భక్తులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

దుర్గాఘాట్ ప్రాంతంలో కొందరు హాకర్లు అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులపై ఈవో తీవ్రంగా స్పందించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులను ఇబ్బందులకు గురిచేసే చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

మరుగుదొడ్ల నిర్వహణను కూడా పరిశీలించిన ఆయన, పరిశుభ్రత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని సిబ్బందికి సూచించారు. భక్తుల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.

ఘాట్‌రోడ్ మరమ్మత్తుల కారణంగా కనకదుర్గానగర్ వైపు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే ఆర్టీసీ ప్రత్యేక బస్సుల సేవలను పరిశీలించి, రవాణా సదుపాయాలను మరింత మెరుగుపర్చాలని సూచించారు.


Leave a Reply