SIR process | మూడో దశ సర్‌కు ఎన్నికల కమిషన్ సన్నాహాలు

SIR process | మూడో దశ సర్‌కు ఎన్నికల కమిషన్ సన్నాహాలు

SIR process | ఓటర్ల తొలగింపులపై పెరుగుతున్న సందేహాలు
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదే
రాజకీయ పక్షాలు, పౌర సమాజం అప్రమత్తంగా ఉండాలి

SIR process | ఎన్నికల కమిషన్ మూడవ దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర రివ్యూ **‘సర్’**ని 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో త్వరలో మొదలుపెట్టబోతోంది. అందుకు తగ్గ సన్నాహాలు చేసుకుంటోంది. ఇందులో ఇరు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మొదటి రెండు దశల్లో దాదాపు 10 శాతం మంది ఓటర్ల పేర్లు తొలగింపులు జరగ్గా, వాటిపై నెలకొన్న సందేహాలు, వివాదాలపై ఎన్నికల కమిషన్ స్పష్టమైన దిద్దుబాట్లేవీ చేపట్టలేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఆ కమిషన్‌కి రాజ్యాంగపరంగా సర్ నిర్వహించే హక్కు, బాధ్యతలున్నట్లు ప్రకటించింది. తనకు లభించిన నైతిక మద్దతుతో ఈ ప్రక్రియ మూడో దశని ఎన్నికల కమిషన్ రెట్టించిన ఉత్సాహంతో చేపట్టనుంది. అప్పుడు కేవలం హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లడఖ్ మాత్రమే ఈ ప్రక్రియ జరగని ప్రాంతాలుగా మిగిలిపోతాయి.

ఈ సర్ ప్రక్రియపై సందేహాలు సామాన్యుడి మదిలోంచి తొలగించే పనేదీ సదరు సంఘం చేయడం లేదు. ప్రజాస్వామ్యానికి కీలకం ఎన్నికలు. ఎన్నికల ఉద్దేశం ప్రభుత్వాన్ని ఏర్పరిచే హక్కు సంపూర్ణంగా ప్రజలకు ఉండడం. ఆ హక్కు ఈ దేశ పౌరుల్లో కడపటి వాడు కూడా పొందడం, తన గొంతు వినిపించగలగడం జరగాలి. అంటే అర్హులెవరూ ఓటు హక్కు కోల్పోరాదు, అనర్హులెవరూ దాన్ని పొందరాదు. ఎన్నికల కమిషన్‌దే ఆ పవిత్రమైన బాధ్యతను నిర్వహించాలి. సుప్రీంకోర్టు చెప్పినట్టు ఆ కమిషన్‌కి ఉన్న ఆ హక్కు, బాధ్యతలపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు.

అయితే దాన్ని హడావిడిగా ముగించే వ్యవహారంగా నిర్వహించడం, తొలగించబడ్డ ఓట్లపై పునఃపరిశీలన కార్యక్రమం పక్కాగా, పీపుల్ ఫ్రెండ్లీగా లేకపోవడం, గంపగుత్త ఓట్ల తొలగింపులు, జనాభాకు అనుగుణంగా లేని ఆశ్చర్యకరమైన లింగ నిష్పత్తుల మార్పులు ఈ ప్రక్రియపై భయాల్ని పెంచుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 2 కోట్లు, పశ్చిమ బెంగాల్‌లో 90 లక్షలు, తమిళనాడులో 70 లక్షల పైన, బీహార్‌లో 40 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. పశ్చిమ బెంగాల్‌లో న్యాయపాలిక నేరుగా పర్యవేక్షించాల్సి వచ్చింది.

ఒక ఓటుతోనే ఎన్నికల ఫలితాలు తారుమారయ్యే ఎన్నికల విధానం అనుసరిస్తున్న దేశంలో కోట్లమంది, దాదాపు 10 శాతం మంది ఓట్లు తొలగింపు జరగడమన్నది రాజకీయ ముఖచిత్రాల్ని మార్చివేసే అంశం. అంతమంది అనర్హులు ఇంతవరకూ పాలనని శాసించారా, లేక ఇప్పుడు అంతస్థాయిలో అర్హులు తమ హక్కుకి దూరమయ్యారా అన్నది చూడాలి. పోనీ అందులో 2 శాతం మంది అర్హులు ఓటు హక్కు కోల్పోయి ఉన్నా అది తీవ్రమైన విషయమే. పరిహాసమే.

కాబట్టి సర్ ప్రక్రియ స్పీడ్‌గా జరగడం కన్నా, సురక్షితంగా జరగాల్సి ఉంది. అనర్హుల సంగతి పక్కకు పెట్టినా, అర్హులై ఉండీ తొలగింపులకు గురైనవాళ్లు సాధారణంగా పేదవాళ్లు, వలస పక్షులు, తమ ధ్రువపత్రాలు దాచి ఉంచుకోలేని వాళ్లు, రాజకీయ రక్షణ లేని వాళ్లు అయ్యి ఉంటారు. ఎలాగూ ఎన్నికల సంఘం రథచక్రాలు స్పీడ్ తగ్గించవు. అదే వేగంగా పోతాయి. కాబట్టి రాజకీయ పక్షాలు, పౌర సమాజం అప్రమత్తతతో ఉండాలి. చక్కగా జరిగేందుకు ప్రముఖ పాత్ర పోషించాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇది చాలా అవసరం. ఎన్నికల్లో చూపించే స్థాయిలో సర్ ప్రక్రియలో కూడా ప్రజా చైతన్యం కనబడాలి.

డా. డి.వి.జి. శంకరరావు
మాజీ ఎంపీ
9440836931

Leave a Reply