51.శివే శృంగారార్ద్రా తదితరజనే కుత్సనపరా
సరోషా గంగాయాం, గిరిశ చరితే (నయన్) విస్మయవతీ
హరాహబ్యో భీతా, సరసీరుహ సౌభాగ్యజయినీ
సఖీషు స్మేరా, తే మయి జనని దృష్టి స్సకరుణా.
తాత్పర్యం: అమ్మలగన్నయమ్మా! మామూలుగా శాంతరసం వెదజల్లే నీ చూపు శివుని చూసేప్పుడు శృంగారరసంతోను, శివేతర జనులను చూసేప్పుడు అయిష్టం కారణంగా బీభత్సరసంతోను, గంగవైపు రోషంగా రౌద్రరసంతోను, శివుడి చరిత్రను వింటున్నప్పుడు గాని, శివుని మూడవ నేత్ర వైశిష్ట్యాన్ని చూచేప్పుడు గాని అద్భుత రసంతోను, శివుడు ఆభరణాలుగా ధరించే సర్పాలని చూచే సమయంలో భయానక రసంతోను, పద్మాల సౌందర్యాన్ని జయించినప్పుడు వీరరసంతోను, చెలులతో సంభాషించేప్పుడు హాస్యరసంతోను, నా యెడల కరుణరసంతోను నిండి నవరసాత్మకంగా ఉంటుంది.
విశేషం: సర్వరసస్వరూపిణి అయిన అమ్మ తన చూపులతోనే నవరసాలని ప్రసరింప చేస్తుంది. నాట్యకళలో ప్రధానాంగమై, ప్రాణమన దగిన అభినయానికి ఆటపట్టు కళ్ళు. అంతే కాదు. మామూలుగా కూడా అన్ని ఇంద్రియాలలోకి ప్రధానమైనది కన్నే. ”సర్వేంద్రియాణాం నయనం ప్రధానం.” అని కదా ఆర్యోక్తి, మనోభావాలకి కళ్ళు అద్దాలు, మనస్సుకి కిటికీలు. మనస్సులో ఉన్న భావాలని మాటలలో బయట పడకుండా జాగ్రత్త పడవచ్చు. ముఖంలో కూడా కనపడకుండా ప్రయత్నం చెయ్యవచ్చు. కానీ, కళ్ళు మాత్రం దాచలేవు. బయట పెట్టేస్తాయి. కళ్ళు భావాలనే కాదు మనిషి వ్యక్తిత్వాన్ని కూడా తెలియ చేస్తాయి. కంటిరెప్పలకి, కనుపాపలకి చైతన్య గుణం అత్యధికం. నిద్రలో కూడా కనుపాపలు చైతన్యవంతంగా ఉంటాయి. సర్వచైతన్యస్వరూప అయిన జగదంబ కన్నులు ఏ ఏ సందర్భాలలో ఏ ఏ రసాలని ఒలికిస్తాయో జగద్గురువులు మనోహరంగా భావన చేశారు. ఈ భావనలో అమ్మకి ఉన్న అనుబంధాలలోని సూక్ష్మమైన ఛాయాభేదాలను సూచించటం ఉంది. ఒక్కొక్క రసం ఎప్పుడు ప్రకటమౌతుందో చక్కగా వివరించారు.
- అమ్మ శాంత స్వరూపిణి. మామూలుగ ఎప్పుడు అమ్మ కన్నులు శాంత రసప్లావితాలై ఉంటాయి. ఆ స్థితి నుండి కాస్త కదలిక కలిగినప్పుడు సర్వరసాలకి మూలమైన శాంతరసంలోని ఒక ఛాయ ప్రాధాన్యం వహస్తుంది.
2. రసరాజమైన శృంగారరసం అమ్మవారి కన్నులలో తొణికిసలాడే సమయం పతి అయిన శివుడితో ఉన్నప్పుడు, ఆయనని చూస్తున్నప్పుడు, ఆయనతో సంభాషిస్తున్నప్పుడు. ఇది సతీధర్మం.
3. శివుడు కాక ఇతరపురుషుల సాన్నిధ్యం అమ్మకి సహంచరానిది. కనుక చూపులలో అయిష్టత, పరాజ్గ్మ ఖత్వమ్, జుగుప్ప చోటు చేసుకుంటాయి. దానితో చూపుల్లో బీభత్సరసం తాండవిస్తుంది.
ఇక్కడ శివేతర జనులు అనే మాటకి మరొక అర్ధం ఎక్కువ సమంజసంగా ఉంటుంది. శివ్శ్శఇతర్స శివేతర. అంటే శివ కాని జనులు. శివ అన్న మాటకి శుభము, మేలు, మంగళము మొదలైన అర్ధాలు ఉన్నాయి కదా. శివేతరులు అంటే శుభప్రదులు కానివారు, అనగా అశుభాలకి నిలయమైన వారు, కీడు చేసేవారు అని అర్ధం. అటువంటి హానికారకులైన వారి పట్ల బీభత్సరసపూర్ణమైన దృష్టి ఉండటం సహజం. మామూలుగా లోకంలో తన పిల్లలకి కీడుచేసే వారిని ఒక తల్లి ఎంత అసహ్యభావనతో చూస్తుందో అందరికి అనుభవమే కదా. అన్ని లోకాలకి తల్లి అయిన జగజ్జననికి లోకకంటకులంటే ఎంత అసహనం ఉంటుందో ఊహించవచ్చు.
4. తన భర్త నెత్తిన ఎక్కి కూర్చున్న గంగ పేరెత్తితే రౌద్రరసంతో ఊగిపోతుంది.
( ఇక్కడ ఒక సంగతిని గుర్తుంచుకోవాలి. గంగ స్వయానా పార్వతీ దేవికి సోదరి. శివుడికి భార్య కాదు. భార్య అంటే భరించబడేది అనే అర్ధంలో శివుడు గంగని నెత్తిన పెట్టుకుని భరిస్తున్నాడు కనుక భర్త అని అనటం లోకవ్యవహారంలో ఉన్నది. అంతే కాదు శివుడి రుద్రాంశ అయిన తేజస్సుని పార్వతీదేవి భరించలేక జారవిడిచిన సమయంలో గంగ దానిని ధరించింది. కొంత కాలం భరించింది. ఈ రెండిటిని పక్క పక్కన పెట్టి, గంగ శివుడి భార్య అని, పార్వతికి సవతి అనే మనోహరమైన భావనలు లోకంలో వ్యాప్తి పొందాయి. దీని ఛాయలు శంకరుల రచనలో కనపడుతున్నాయా? అనిపిస్తోంది. కాని యదార్థానికి పార్వతికి కోపం రావటానికి ఇది కారణం కాదేమో! భగీరథుడు శివుడి గురించి తపస్సు చేసి గంగ ఆకాశంనుండి వస్తుంటే భరించిమని అడిగితే భక్తవత్సలుడైన శివుడు అంగీకరించాడు. శివుడి శిరస్సున పడిన గంగ అహంకారంతో ఎగసి పడుతుంటే శివుడు దాని పొగరు అణచటానికి జటాజూటంలో బంధించాడు. తరువాత భగీరథుడు ప్రార్ధిస్తే జటల మధ్య చిన్న సందు చేసి కొద్దిగా వదిలాడు. భర్త అంటే అంతులేని ప్రేమ ఉన్న పార్వతికి భర్త పట్ల అపచారం చేసిన గంగ అంటే కోపం ఉండటం సమర్ధనీయమే కదా!)
5. శివుడి శరీరం మీద ఉన్న నాగాభరణాలని చూస్తే భయం కలిగి భయానక రసం కళ్ళలో నిండుతుంది. ఎందుకంత భయం? తన గురించి కాదు. తన బిడ్డలైన వారి గురించి. పాములని చూసి వారు భయపడతారేమో? అవి వారిని బుసకొట్టి భయపెడతాయేమో? అవి వారిని కాటేస్తాయేమో? ఈ భావనల కారణంగా భయానకరస భూయిష్టంగా ఉంటాయి అమ్మ చూపులు, తన బిడ్డలని భయపెట్టేవారి వంక కోపంగా చూడదా ఏ తల్లి అయినా?
6. ఏ దేవతలు చేయని ఆశ్చర్యకరమైన, అద్బుతావహమైన పనులు కొన్ని శివుడు చేశాడు- హాలాహల భక్షణం, త్రిపురాసుర సంహారం, కామదహనం మొదలైనవి. ఎన్ని మారులు విన్నా ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంటాయి. అందులోనూ తనకి ఇష్టమైన వారి మహత్కార్యాలని మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉంటుంది. అవి విన్నప్పుడల్లా అమ్మ ముఖంలో ఆశ్చర్యం, కన్నులలో అద్భుత రసం వెల్లివిరుస్తాయి.
7. తమ సౌభాగ్యంతో ఎవరు సాటి రారు, తమని ఎవరు గెలవలేదు అని మిడిసిపడుతూ ఉండే తామరలని అంతకంటే ఎక్కువ సౌందర్య, ప్రకాశ, వికాసాలతో ఒప్పుతూ చూసేప్పుడు కళ్ళలో విజయ గర్వం, వీరరసం చిప్పిల్లుతు ఉంటాయి.
”సరసిరుహ సౌభాగ్య జననీ’ అని పాఠాంతరం ఉంది. పద్మాలకి సౌభాగ్యం కలగటానికి కారణమైనది అని అర్ధం. పద్మాలు వికసించి పరిమళించటానికి సూర్యకిరణ స్పర్శయే కారణం కదా. ఆ సూర్యుడు అమ్మవారి కుడి కన్ను. అమ్మ కుడికంటి నుండి ప్రసరించిన అనుగ్రహం వల్ల పుట్టినది తామరల సౌభాగ్యం, కనుక పద్యాల సౌభాగ్యానికి అమ్మవారి చూపు తల్లి వంటిది. తన అనుగ్రహము మీద ఆధారపడిన పద్మాల సౌభాగ్యం తనతోనే పోటీకి వస్తే ఎవరి కళ్లలోనైనా వీరరసం తాండవించటం సహజం.
8. చెలులతో ఉన్నప్పుడు హాస్యరస నిధానమన్నట్టు నవ్వుతూ దర్శనమిస్తుంది.
9. కరుణరస ప్రకటన విషయంలో శంకరుల చాతుర్యం కనపడుతుంది. అమ్మ తనని చూచేప్పుడు ఆ కన్నులలో కరుణరసం నిండి పొంగులు వారుతుందిట. ఇక్కడ నా యందు అన్నప్పుడు శంకరులు మాత్రమే అనే అర్ధం కాదు. ఈ విధంగా అమ్మని దర్శించి, ఈ శ్లోకంతో కీర్తించే వారు అందరి యందు అని అర్ధం చేసుకోవాలి. మనం కూడా కీర్తుస్తున్నాం కదా!
- డాక్టర్ అనంతలక్ష్మి