“డ్రగ్స్ వద్దు బ్రో – క్రికెట్ ముద్దు బ్రో”

“డ్రగ్స్ వద్దు బ్రో – క్రికెట్ ముద్దు బ్రో”

నినాదంతో ఫ్యాక్టరీ ప్రీమియర్ లీగ్ ప్రారంభం

గుంటూరు బ్యూరో / ఆంధ్రప్రభ : యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడుతూ క్రీడల వైపు మళ్లించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “ఫ్యాక్టరీ ప్రీమియర్ లీగ్ – సీజన్ 2” క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం తాడేపల్లి టౌన్ పరిధిలోని బ్రహ్మానందపురం స్కూల్ గ్రౌండ్‌లో ఘనంగా ప్రారంభమైంది.

ఉదయం 10:15 గంటలకు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకే రవికృష్ణ హాజరై టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 50 జట్లు పాల్గొననున్నాయి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా “డ్రగ్స్ వద్దు బ్రో” ప్రచార కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువతలో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు క్రీడలను ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తున్నామని చెప్పారు.

“డ్రగ్స్ వద్దు బ్రో – క్రికెట్ ముద్దు బ్రో” అనే నినాదంతో యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు విద్యాసంస్థల్లో సుమారు 40 వేల ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

విద్యార్థులు కనీసం రెండు క్రీడలను తమ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించిన ఆయన, ఒత్తిడిని జయించడానికీ, జీవితంలో విజయాలను సాధించడానికీ క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. ప్రతి క్రీడాకారుడు “డ్రగ్స్ వద్దు బ్రో” సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఫ్యాక్టరీ ప్రీమియర్ లీగ్ నిర్వహకులతో పాటు పాలకొండ ప్రాంత క్రీడాకారులకు ఈగల్ ఆంధ్రప్రదేశ్ తరపున ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ కే. నాగేష్ బాబు, డీఎస్పీ మరియు ఏపీ పోలీస్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఏ. శాంతి రాజు, శ్వాస ఆర్గనైజేషన్‌కు చెందిన డా. అనిత జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply