ఆర్‌టీఐ చట్టానికి అరణ్యరోదన..

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పారదర్శకతకు పాతర..
  • సమాచార హక్కు చట్టం పుట్టి రెండు దశాబ్దాలు పూర్తి

కొత్తగూడెం టౌన్, ఆంధ్రప్రభ : ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యతను కొందరు అధికారులు విస్మరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఒకటైన సమాచార హక్కు చట్టం అమలులోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీశాఖ కార్యాలయం ఉదాహరణగా నిలుస్తోందని ఆర్టీఐ కార్యకర్తలు పేర్కొంటున్నారు. జిల్లా అటవీశాఖ కార్యాలయంలో కనీసం అప్పిలేట్ అధికారి ఫోన్ నంబర్ కూడా అందుబాటులో లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు ఆరోపిస్తున్నారు.

అధికారుల వివరాలు అందుబాటులో ఉండాలి..

సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమాచార అధికారి, అప్పిలేట్ అధికారి వివరాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. వారి పేర్లు, హోదాలు, సంప్రదింపు వివరాలు, ఈమెయిల్ వంటి సమాచారాన్ని స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీశాఖ కార్యాలయంలో ఈ వివరాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని ఆర్టీఐ కార్యకర్తలు పేర్కొంటున్నారు. సమాచారం కోరే సామాన్యులకు, దరఖాస్తుపై స్పందన రాకపోతే ఎవరిని ఆశ్రయించాలో తెలుసుకోవడం కష్టంగా మారుతోందని చెబుతున్నారు.

పలు అంశాలపై సమాచారం కోరుతున్న ప్రజలు..

జిల్లాలో అటవీ భూముల ఆక్రమణలు, చెట్ల నరికివేత, అక్రమ మైనింగ్ తదితర అంశాలపై ప్రజలు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరుతున్నారని ఆర్టీఐ కార్యకర్తలు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సంబంధిత అధికారుల వివరాలు అందుబాటులో లేకపోవడం వల్ల దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తున్నారు. సమాచారాన్ని పొందడంలో కాలయాపన జరుగుతోందన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.

చర్యలు తీసుకోవాలని డిమాండ్..

జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయంలో కనీస సమాచార బోర్డులు, అధికారుల సంప్రదింపు వివరాలు అందుబాటులో లేకపోవడం పర్యవేక్షణ లోపానికి నిదర్శనమని ఆర్టీఐ నిపుణులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, నిబంధనల అమలులో లోపాలు ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలోని అన్ని అటవీ కార్యాలయాల్లో ప్రజా సమాచార అధికారి, అప్పిలేట్ అధికారుల పేర్లు, హోదాలు, ఫోన్ నంబర్లతో కూడిన సమాచార బోర్డులను స్పష్టంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.