తిరుపతమ్మ తల్లి ఆలయం సమగ్ర అభివృద్ధి చేస్తాం..
- ప్రభుత్వ నిధులు తీసుకువస్తాం
- అట్టహాసంగా పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవం
- హాజరైన ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం
- ప్రసాద్ పథకం ద్వారా నిధులు సాధించేందుకు కృషి చేస్తాం
- దాతల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేద్దాం
- దేవాదాయ శాఖ మంత్రిని ఆలయానికి తీసుకొచ్చి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
- ఎంపీ చిన్ని
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేసేందుకు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన తిరుపతమ్మ దేవాలయం పాలకమండలి అభినందన సభలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాంతో కలిసి ఎంపీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆలయ పాలకమండలి సభ్యులకు అభినందనలు తెలిపారు. పాలకమండలి బాధ్యతలు స్వీకరించడంతోనే పని పూర్తయిందని భావించకుండా, అమ్మవారి ఆలయ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వ సహకారం..

తిరుపతమ్మ ఆలయానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ద్వారా సమకూర్చేందుకు తన వంతు కృషి చేస్తానని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. భక్తుల సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు ఆలయ ప్రాంగణ అభివృద్ధి, అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం ద్వారా ఆలయానికి నిధులు తీసుకువచ్చే అంశంపై కూడా కృషి చేస్తానని తెలిపారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు, సంబంధిత శాఖలతో సమన్వయం వంటి అంశాల్లో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
దాతల సహకారంతో అభివృద్ధి..
ప్రభుత్వ నిధులతో పాటు భక్తులు, దాతల సహకారాన్ని కూడా వినియోగించుకుని ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఎంపీ చిన్ని పిలుపునిచ్చారు. ‘‘అందరం కలిసి తలో చేయి వేస్తే తిరుపతమ్మ ఆలయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లవచ్చు’’ అని అన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
మంత్రి దృష్టికి ఆలయ సమస్యలు..
తిరుపతమ్మ ఆలయానికి సంబంధించిన సమస్యలు, అవసరాలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని కేశినేని చిన్ని తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రిని ఆలయానికి తీసుకొచ్చి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించేలా కృషి చేస్తామని చెప్పారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన చర్యలపై పాలకమండలి, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆధ్యాత్మిక పర్యాటకానికి కేంద్రంగా తీర్చిదిద్దాలి..
ప్రస్తుతం దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఎంపీ చిన్ని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి ఆలయానికి ఉన్న ప్రత్యేకత, చారిత్రక–ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అమ్మవారి విశిష్టతను ప్రతి ఒక్కరికీ తెలియజేసేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. జగ్గయ్యపేట నియోజకవర్గం ప్రత్యేకమైన ప్రాంతమని, ఇక్కడి ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందన్నారు. రాబోయే కాలంలో కూటమి నేతలకు తగిన ప్రాధాన్యం, న్యాయం కల్పించే దిశగా చర్యలు ఉంటాయని తెలిపారు.
సమన్వయంతో పని చేయండి…
తిరుపతమ్మ ఆలయాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని ఆలయ చైర్మన్, పాలకమండలి సభ్యులను ఎంపీ కేశినేని చిన్ని కోరారు. భక్తుల అవసరాలు, ఆలయ మౌలిక వసతులు, ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ కార్యాచరణ రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు, జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
