బడి ఈడు పిల్లలు తప్పనిసరిగా విద్యనభ్యసించాలి..

బడి ఈడు పిల్లలు తప్పనిసరిగా విద్యనభ్యసించాలి..
వారిని బడిలో చేర్పిద్దాం.. బంగారు భవితకు బాటలు వేద్దాం
ప్రచార పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : బడి ఈడు పిల్లలు తప్పనిసరిగా పాఠశాలలో చేరి విద్యను అభ్యసించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కొండపల్లిలో విద్యా శాఖ, సమగ్రశిక్ష అధికారులతో కలిసి బడి పిలుస్తోంది ప్రచార పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని, పాఠశాలల్లో మౌలిక వసతులు, నాణ్యమైన బోధన అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పకుండా పాఠశాలకు పంపించి, వారి భవిష్యత్తును బలంగా నిర్మించాలన్నారు.
ఈ నెల 23వ తేదీ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ జరుగుతోందని.. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మన ప్రభుత్వ బడి ప్రత్యేకతలపై ర్యాలీల ద్వారా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, తల్లికి వందనం, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర వంటి కార్యక్రమాలతో పాటు అర్హత, అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో ఉచిత విద్యాబోధన లభిస్తుందన్నారు.
స్మార్ట్ టీవీలు, ఐఎఫ్‌పీల ద్వారా పూర్తిస్థాయిలో డిజిటల్ విద్యాబోధన లభిస్తుందని వివరించారు. కార్యక్రమంలో డీఈవో ఎల్.చంద్రకళ, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.రమేష్‌బాబు, సెక్టోరియల్ అధికారులు ఎ.వి.వి.ప్రసాదబాబు, ఎస్.అశోక్‌బాబు, బి.విశ్వభారతి, సిహెచ్.శిరీషారాణి, ఎంఈవో పుష్పలత, సీఆర్పీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
