ఉపాధ్యాయ కుటుంబానికి ‘ఐక్య’ భరోసా….

ఉపాధ్యాయ కుటుంబానికి ‘ఐక్య’ భరోసా….
TSUTF కుటుంబ సంక్షేమ నిధి నుండి రూ. 6 లక్షల చెక్కు అందజేత
బాధితులకు అండగా నిలవడమే మా లక్ష్యం : రాష్ట్ర అధ్యక్షులు చావా రవి
గరిడేపల్లి (సూర్యాపేట జిల్లా) ఆంధ్రప్రభ : కష్టకాలంలో ఉన్న తోటి ఉపాధ్యాయ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కొండంత అండగా నిలుస్తుందని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి అన్నారు ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందిన గరిడేపల్లి మండలం, గారకుంట తండా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, టీఎస్‌యూటీఎఫ్ సీనియర్ నాయకులు భానోత్ నాగేశ్వరరావు కుటుంబానికి సంఘం తరపున ఆరు లక్షలు ఆర్థిక సాయం బుధవారం ఆయన సొంత గ్రామమైన రేగులగడ్డ తండాలో భార్య ఆదిలక్ష్మి కి అందించారు.
ఈ సందర్భంగా చావా రవి మాట్లాడుతూ, ఉపాధ్యాయుల్లో భరోసా నింపేందుకు మూడేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ‘కుటుంబ సంక్షేమ నిధి’ పథకం అద్భుత ఫలితాలనిస్తోందని అన్నారు. ఇప్పటివరకు చనిపోయిన 59 మంది ఉపాధ్యాయుల కుటుంబాలకు సుమారు రూ. 3.5 కోట్ల రూపాయలను సంఘం సభ్యుల నుండి సేకరించి అందించినట్లు పేర్కొన్నారు”ఒక్కరి కోసం అందరం.. అందరి కోసం ప్రతి ఒక్కరం” అనే నినాదంతో ఈ పథకం కొనసాగుతోందని, దేశంలో ఏ ఇతర ఉపాధ్యాయ సంఘం ఇటువంటి సాహసోపేతమైన, గొప్ప నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
FWF చైర్మన్ ఎం. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, అకస్మాత్తుగా కుటుంబ పెద్దను కోల్పోయి వీధిన పడిన ఉపాధ్యాయ కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం ఎంతో ఊరటనిస్తుందని పేర్కొన్నారు. కేవలం వృత్తిపరమైన పోరాటాలే కాకుండా, సామాజిక బాధ్యతగా తమ సభ్యుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. గ్రామ సర్పంచ్ సరోజా నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఒక ఉపాధ్యాయుడు మరణిస్తే రాష్ట్ర స్థాయి నాయకులు స్వయంగా గ్రామానికి వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం వారి నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎన్. సోమయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్ కుమార్, రాష్ట్ర కోశాధికారి వై. సైదులు సహా పలువురు జిల్లా, మండల నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
