పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి

ట్రాక్టర్ కు తాడు కట్టి లాగుతూ వైసీపీ
నాయకులు వినూత్న నిరసన
ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద నుండి ర్యాలీ

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : పెంచిన పెట్రోల్, డీజల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉరవకొండ పట్టణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద నుండి టవర్ క్లాక్, తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్ కు తాడు కట్టి లాగుతూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ పెట్రో ధరలు రాష్ట్రంలోనే అత్యధికం. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో పెట్రోల్, డీజల్ ధరలు మండుతున్నారు. రాష్ట్రంపై పెట్రోల్ భారం రూ.3,391 కోట్లు రూపాయలన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం మరో బాదుడే బాదుడు మొదలుపెట్టింది. సూపర్‌సిక్స్‌ తరహాలో మరో మోసంతో పచ్చి దగా చేస్తున్నదని ఆయన విమర్శించారు. అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తామని, మ్యానిఫెస్టోలో పెట్టి, అన్నింటిలాగే ఆ విషయాన్ని గాలికి వదిలేసిందన్నారు. ఒకవైపు సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు లేవు. గత మా ప్రభుత్వంలో అమలు చేసిన అన్ని పథకాలు రద్దు చేయడ మే కాకుండా, ఇప్పుడు ఈ తరహా పెట్రోల్ బాదుడే బాదుడుతో వాహనదారులతో పాటు, ప్రజల నడ్డి పిరుస్తోంది తాజా పెంపుతో రాష్ట్రంలో లీటరు పెట్రోల్‌ రూ.113.62, లీటర్‌ డీజిల్‌ రూ.101.24కు చేరుకుందన్నారు. రాష్ట్రంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) ఎక్కువగా ఉండటం తో, దేశం మొత్తం మీదఇక్కడే పెట్రోల్, డీజిల్‌ ధరలు అత్యధికంగా ఉన్నాయని తెలిపారు.

పెరిగిన ధరల వల్ల పెట్రోల్‌పై రోజూ రూ.3.29 కోట్లు, డీజిల్‌పై రూ.6 కోట్లు అధిక భారం రాష్ట్రంలో వాహనదారులపై పడుతుంది. రాష్ట్రం వేసే పన్నే అందుకు కారణం అని, టీడీపీ అధి­కారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్‌పై వేసిన పన్నును తగ్గిస్తామని, దానివల్ల రాష్ట్రంలో అన్ని ధరలు తగ్గుతాయి అని ఎన్నికల ముందు చంద్రబాబు, నారా లోకేష్‌ ఊదరగొట్టారు. రాష్ట్రంలో అత్యధికంగా లీటర్‌ పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్‌తో పాటు రూ.4 ఇంకా మరో ఒక్క రూపాయి రోడ్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌గా వసూలు చేస్తున్నారు. అధికారం లోకి రాగానే, అవన్నీ తగ్గిస్తామని నాడు హామీ ఇచ్చిన చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదన్నారు.

చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్, ఇతర బాదుడు తగ్గించి, ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసిల్దార్ భోగన్న గౌడ్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈడిగ ప్రసాద్, మాజీ ఎంపీపీ ఎర్రి స్వామి, బసవరాజు, ఆసిఫ్, మూలగిరి పల్లి ఓవన్న, మాజీ జెడ్పిటిసి తిప్పయ్య, సర్మస్, ఎర్రి స్వామి రెడ్డి, అశోక్ కుమార్, సిద్ధప్ప, గోవిందు, శ్రీరాములు, నాగరాజు, భీమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply