కొల్లు రవీంద్ర ఫైర్.. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు
కొల్లు రవీంద్ర ఫైర్.. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర భూగర్భ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం మౌలిక వసతుల కల్పనకు పెద్దఎత్తున కృషి చేశామని తెలిపారు. అయితే గత ఐదేళ్లలో అధికారంలో ఉన్న పార్టీ ప్రజా సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.
గత తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తీసుకొచ్చినా, పనులు జరగకుండా కావాలనే విజిలెన్స్‌కు ఫిర్యాదులు చేసి అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగపడే పనులు ఆపడం, అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్షాల పని అయిపోయింది అంటూ మంత్రి విమర్శించారు. మచిలీపట్నం నగరంలో ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన డ్రైనేజీ సమస్య పరిష్కారానికి రూ.13 కోట్లతో ప్రత్యేక పనులు చేపడుతున్నామని వెల్లడించారు. ఈ పనులకు సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రి త్వరలో వచ్చి ప్రారంభోత్సవం నిర్వహిస్తారని తెలిపారు.
