భువనగిరి–నల్గొండ రహదారి గుంతలు వెంటనే పూడ్చాలి

  • టేకులసోమారం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో
  • స్పందించకుంటే రోడ్డుపైనే వంటావార్పు నిర్వహిస్తాం

వలిగొండ, ఆంధ్రప్రభ : భువనగిరి–నల్గొండ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చాలని సీపీఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలంటే ఎమ్మెల్యేకు, అధికారులకు లెక్క లేదా? ఇంకెంత మంది చనిపోతే స్పందిస్తారని ఆయన ప్రశ్నించారు. శనివారం టేకులసోమారం గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో వలిగొండ–భువనగిరి రహదారిపై గుంతలను పూడ్చాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిర్పంగి స్వామి మాట్లాడుతూ మండల పరిధిలోని అక్కంపల్లి నుంచి మాందాపురం, ఏదుళ్లగూడెం స్టేజీల మీదుగా టేకులసోమారం వరకు రహదారి గుంతలమయంగా మారిందన్నారు.

ఇటీవల టేకులసోమారం గ్రామంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని తెలిపారు. ఆటోలు, ద్విచక్ర వాహనదారులు గుంతల్లో పడి కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. రహదారి పరిస్థితిపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గుంతల మరమ్మతుల విషయంలో ఎమ్మెల్యే ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి రహదారిపై గుంతలను పూడ్చాలని డిమాండ్ చేశారు.

సమస్యను పరిష్కరించకుంటే రోడ్డుపైనే వంటావార్పు నిర్వహించి రహదారిని దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీఎన్‌ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, సీపీఎం మండల కమిటీ సభ్యులు రేఖల లక్ష్మీనారాయణ, చీర్క శ్రీశైలం రెడ్డి, దుబ్బ లింగం, సీపీఎం నాయకులు కొండూరు సత్తయ్య, పలుసం లింగం, చేగురి నగేష్, భూమి బాలశంకర్, రేపాక ముత్యాలు, గుమ్మడి యాదిరెడ్డి, వేముల లక్ష్మయ్య, ఉండ్రాటి పాపయ్య, దేశపాక రవి, వట్టిపల్లి చంద్రయ్య, మైసొల్ల నరేందర్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.