చిన్నారుల భవిష్యత్తుకు పోలియో చుక్కలే శ్రీరామరక్ష

శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ : ఐదేళ్ల లోపు వయసున్న చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు తల్లిదండ్రులు పునాది వేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి అనిత పిలుపునిచ్చారు. స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీలోని అంబేద్కర్ భవన్ వద్ద ఆదివారం ఉదయం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆమె అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. జిల్లాలో వంద శాతం పోలియో నిర్మూలనే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని స్పష్టం చేశారు. మొదటి రోజు నిర్దేశిత బూత్‌లలో చుక్కల మందు వేస్తామని, ఏదైనా అనివార్య కారణాల వల్ల రా లేకపోయిన పిల్లల కోసం తరువాత రెండు రోజుల పాటు సిబ్బంది నేరుగా ఇంటింటికీ వచ్చి వ్యాక్సిన్ వేస్తారని వివరించారు .

ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి రాందాస్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ స్వరూప్ పాల్గొని సాంకేతిక అంశాలను పర్యవేక్షించారు. వారితో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మంత్రి వెంకటస్వామి, రోటరీ క్లబ్ ప్రతినిధి నటుకుల మోహన్ తదితరులు హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. జిల్లావ్యాప్తంగా గుర్తించిన చిన్నారులందరికీ ఈ మూడు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమం లో వ్యాక్సిన్ అందేలా క్షేత్రస్థాయి సిబ్బంది చొరవ చూపాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.