పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

వేములవాడ, ఆంధ్రప్రభ: మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు సూచించారు. మున్సిపల్ విలీన గ్రామమైన తిప్పాపూర్ ఏరియా ఆసుపత్రి ప్రాంతంలో ఉన్న డ్రైనేజీ సమస్యలను స్థానిక కౌన్సిలర్లు ఎల శ్రీనివాస్, మైలారం శ్రీనివాస్‌లతో కలిసి ఆదివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త, మురుగునీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న సమస్యలపై అధికారులతో చర్చించి, వెంటనే శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుధ్య సమస్యలను చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీ వ్యవస్థను నిరంతరం మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో పట్టణంలో ఎక్కడా మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్లు, నాయకులు నాగుల విష్ణు ప్రసాద్, సిరిగిరి శ్రీకాంత్, తిరుపతి, మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.